ప్రపంచం అభివృద్ధి సాగుతున్న తరుణంలో వివిధ వెనుకబడిన దేశాలు వాటితో కలిసేందుకు సిద్దం అవుతున్నాయి. అభివృద్ధి ఫలాలను అందుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఇదే కోవలో ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియా.. బ్రిక్స్ కూటమిలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నది. కూటమిలో తమకు సభ్యత్వం కల్పించాలని ముస్లిం దేశం కోరుతున్నది. కూటమికి చెందిన బ్రిక్స్ బ్యాంకులో షేర్‌హోల్డర్ మెంబర్‌గా ఉంటామని, తమకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నది. 1.5 బిలియన్ డాలర్లతో బ్రిక్స్ బ్యాంకులో షేర్‌హోల్డర్ సభ్యుడిగా ఉంటామంటూ అప్లయ్ చేసుకున్నదని మీడియా వర్గాలు వెల్లడించాయి. కొత్త ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బ్రిక్స్‌లో చేరాలనుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్‌మాజిద్ టెబ్బౌన్ తన చైనా పర్యటనలో పేర్కొన్నారు. ఉత్తర ఆఫ్రికాలో చమురు, గ్యాస్ నిక్షేపాలు అధికం కాగా అల్జీరియాలో సమృద్ధిగా ఉన్నాయి. బ్రిక్స్‌లో ఆ దేశం ప్రవేశించడానికి ఇప్పటికే చైనా, రష్యాలు మద్దతు ప్రకటించాయి.
బ్రిక్స్ 15వ సదస్సుకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తున్నది. ఆగస్టు 22 నుంచి 25 వరకు జొహెన్నెస్‌బర్గ్‌లో ఈ సమావేశాలకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. బ్రిక్స్ సదస్సుకు సర్వం సిద్ధం చేశామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ప్రకటించారు.