Sunday, November 3, 2024
HomeTrending Newsబిజెపి వ్యూహకర్త ఇకపై వైసీపీకి.....

బిజెపి వ్యూహకర్త ఇకపై వైసీపీకి…..

వైఎస్సార్సీపీకి ఓ సరికొత్త సలహాదారుడు వచ్చాడు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి, మహబూబ్ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్ధులకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి వారి విజయంలో కీలక పాత్ర పోషించిన ఆళ్ల మోహన్ సాయి దత్ ఇకపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు పార్టీ నిర్మాణంలో సలహాలు ఇవ్వనున్నారు. వైఎస్ జగన్ సూచనల మేరకు దత్ ను ‘అడ్వైజర్ టూ పార్టీ ప్రెసిడెంట్ ఆన్ పార్టీ బిల్డింగ్’ గా  నియమిస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్, 24 ఎన్నికల్లో రిషి సారధ్యంలోని ఐ-ప్యాక్ టీమ్ లతో వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నుంచి నెమ్మదిగా కోలుకొని పార్టీ నిర్మాణంపై జగన్ దృష్టి సారిస్తున్నారు. వివిధ విభాగాలకు, జిల్లా పార్టీలకు, రాష్ట్ర పార్టీలోనూ వివిధ నియామకాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా నియమించడం విశేషం. అదే కోవలో సాయి దత్ నియామకం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది.
ప్రశాంత్ కిషోర్ కూడా వైఎస్ జగన్ తో కలిసి పని చేయకముందు బిజేపితో, నరేంద్ర మోడీతో ఉన్నారు. జగన్ విజయం సాధించి అధికారం చేపట్టిన తరువాత ప్రశాంత్ కిషోర్ దూరమై బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవ్యరిస్తూ వస్తున్నారు.  ఆయనతో కలిసి పనిచేసిన రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి, రిషి నేతృత్వంలోని మరో టీమ్ వైసీపీకి జత చేరారు. ఈ ఎన్నికల తరువాత రిషి టీమ్ ను తప్పించారు.  తాజాగా  ఎన్నికల సలహాదారుగా కాకుండా పార్టీ  ఈ నియామకం చర్చకు దారితీస్తోంది.
చెన్నై ఐఐటీలో చదివిన ఆళ్ల మోహన్ సాయి దత్ గతంలో రెండేళ్ల పాటు నారా లోకేష్ కోసం మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల వ్యూహాలు, పర్యటనలకు సమన్వయకర్తగా పని చేశారు. కానీ రాబిన్ శర్మ బృందం క్రియాశీలకంగా ఉండడంతో దత్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల ముందు టీవీ9లో పలు చర్చా వేదికల్లో కూడా పాల్గొన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీతో కలిసి పని చేస్తూనే కేంద్ర నాయకత్వంలోని ఓ కీలక నేతకు క్షేత్రస్థాయి సమాచారం ఇచ్చే బృందంగా కూడా ఉన్నారు.
వైసీపీ ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నా జిల్లా స్థాయి నియామకాలు, రీజినల్ కోర్దినేటర్లు, సమన్వయ కర్తల నియామకాలు జరిగాయి తప్ప గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణంపై వైఎస్ జగన్ దృష్టి సారించలేదు. కానీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలాకాదు, క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ నియామకాలు అధికారంలో ఉన్నా, లేకపోయినా క్రమం తప్పకుండా కమిటీల ఏర్పాటు జరుగుతూనే ఉంటుంది. జగన్ తన పాలనలో గ్రామస్థాయిలో పూర్తిగా వాలంటీర్ల మీదే ఆధారపడ్డారు తప్ప చివరకు ఎమ్మెల్యేల మాట కూడా తీసికట్టు అనే విధంగా వ్యవహారం సాగింది. వాలంటీర్లు, కొద్ది మంది అధికారులు వాస్తవ పరిస్థితి తెలియకుండా జగన్ ను తప్పుదోవ పట్టించారు, దాని ఫలితమే ఘోర ఓటమి. దీన్ని గమనించే పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఈ కొత్త నియామకంతో పార్టీకి ఏ మేరకు ప్రయోజనం ఒనగూరుతుందో వేచి చూడాలి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్