Sunday, September 8, 2024
HomeTrending NewsAlla Nani: పవన్ వి సభ్యత లేని వ్యాఖ్యలు: నాని

Alla Nani: పవన్ వి సభ్యత లేని వ్యాఖ్యలు: నాని

సిఎం జగన్ ను పవన్ ఏకవచనంతో పిలిచినంత మాత్రాన ఆయనకు ఊడేమీలేదని మాజీ డిప్యూటీ సిఎం ఆళ్ళ నాని వ్యాఖ్యానించారు. జగన్ పేరు ఉచ్ఛరించే అర్హత అసలు పవన్ కు ఉందా అని నిలదీశారు.  ఏలూరు సభ పెట్టింది ప్రజలను ఉద్ధరించడానికా లేకపోతే జగన్ ను  ఏకవచనంతో పిలుస్తానని చెప్పడానికా అని అడిగారు. ఇదేదో పెద్ద మేనిఫెస్టో లాగా ప్రకటించారని ఎద్దేవా చేశారు. పట్టుమని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా యాత్ర పూర్తి కాకుండానే ఆయనకు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో  అర్ధం కావడం లేదన్నారు. ఆయన తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో ఉన్నారన్నారు. ఈ ఆరాటం, పోరాటం అంతా  చంద్రబాబును, లేకపోతే లోకేష్ ను సిఎం చేయడానికేనన్నారు.

పవన్  మొదటి విడత వారాహి యాత్రలో కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని,  జగన్ పై దూషణలు, ఎమ్మెల్యేలు, మంత్రులను పొడుస్తా, చొక్కాలు ఊడదీసి కొడతా లాంటి హెచ్చరికలు చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అక్కడి సమస్యలు అధ్యయనం చేసి మాట్లాడతారని అనుకున్నామని  కానీ నిన్నటి రెండో విడత యాత్రలో మరింత దిగజారి మాట్లాడారని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో పాదయాత్ర చేస్తే జనం ఇబ్బంది పడతారని చెప్పిన పవన్… కేవలం కలర్ మారిపోతే సినిమా షూటింగ్ లు రావన్న ఉద్దేశంతోనే నాడు యాత్ర మానుకున్నారని మండిపడ్డారు.

వాలంటీర్ల వ్యవస్థ గురించి అసలు పవన్ కు ఏం తెలుసని నాని ప్రశ్నించారు. వాలంటీర్ ను ప్రతి లబ్ధిదారుడూ తమ కుటుంబ సభ్యుడిగా చూస్తున్నారని అన్నారు. అలాంటి వ్యవస్థపై నీఛమైన, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయం హేయమన్నారు. కోవిడ్ సమయంలో బాబు, పవన్ లు ఫామ్ హౌసుల్లో విశ్రాంతి తీసుకుంటుంటే వాలంటీర్లు మాత్రం సిఎం జగన్ సూచనలతో ఇంటింటికీ వెళ్లి సేవలు అందించారని, కోవిడ్ రోగులకు వైద్య సహాయం అందేలా చూశారని నాని వివరించారు.  తన కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడారని చెబుతున్న పవన్ కు… వాలంటీర్లకు కూడా కుటుంబాలు  ఉంటాయని, ఇలాంటి అసభ్యమైన వ్యాఖ్యలతో వారు ఎంత బాధ పడతారో తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్