Saturday, January 18, 2025
HomeTrending Newsపాక్ వరదబాధిత ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలు

పాక్ వరదబాధిత ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలు

Allah Hu Akbar Tehreek : అకాల వర్షాలు, వరదలకు తోడు కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి పాకిస్తాన్ లో కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. ద్రవ్యోల్భణం, అదుపులేని ధరల పెరుగుదల పాక్ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా దేశంలోని సుమారు 60 శాతం భూభాగం వరదల బారిన పడింది. దీంతో ఆహార సంక్షోభం ఏర్పడింది. దీనికి తోడు బలోచిస్తాన్ లో వేర్పాటు వాదం, సింద్ లో ఆర్థిక వెనుకబాటు, ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో మతోన్మాద మూకలతో అస్థిరత నెలకొంది. తాజాగా వరదల ధాటికి పంజాబ్ రాష్ట్రం కూడా చిన్నాభిన్నం అయింది. సుమారు మూడు కోట్ల పైచిలుకు జనాభా నిలువ నీడ లేక రోడ్డున పడ్డారు. ప్రభుత్వం నుంచి సాయం అంతంతమాత్రంగానే ఉంది. అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి మినహా దేశాల పరంగా ఎవరు ముందుకు రావటం లేదు.

ఇదే అదునుగా ఉగ్రవాద మూకలు మళ్ళీ జడలు విప్పుతున్నాయి. వరద బాదిత ప్రాంతాల్లో సాయం పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నారు. జిహాద్ కు యువతీ యువకుల్ని తయారు చేస్తున్నారు. ఇందు కోసం లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థలు రంగంలోకి దిగాయి. అల్లా హు అక్బర్ తెహ్రీక్(AAT) పేరుతో కొత్త సంస్థ  ప్రారంభించారు. ఈ సంస్థకు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. పాక్ మిలిటరీ, స్వచ్చంద సంస్థలకు దీటుగా AAT వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సంస్థ ఇటీవల ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని గెలుచుకుంది.

లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ కు AAT తో సంబంధాలు ఉన్నాయని సౌత్ ఆసియ ప్రెస్ మీడియా సంస్థ ప్రకటించింది. AAT సమన్వయకర్తగా ఉన్న అబ్దుల్ రఫుఫ్ కు లష్కర్ ఏ తోయిబాతో సంబంధాలు ఉన్నాయని విచారణ సంస్థలు కూడా ప్రకటించాయి. అబ్దుల్ రవూఫ్ కు తీవ్రవాద నేతలు హఫీజ్ సయీద్, నదీం అవాన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  లష్కర్ ఏ తోయిబాను నిషేధించటంతో జమాత్ ఉద్ దావా, ఫలాహ్ ఏ ఇన్సానియత్ ఫౌండేషన్ పేరుతో వీరంతా కార్యాకలాపాలు నిర్వహించారు. వాటి మీద కుడా వేటు పడటంతో కొన్నాళ్ళుగా సబ్డుగా ఉంది మళ్ళీ మతోన్మాద విస్తరణకు సిద్దమవుతున్నారు.

ఆర్థికంగా అవసాన దశలో ఉన్న పాకిస్తాన్ పాలకులకు తాజా పరిణామాలు శరఘాతంగా పరిణమించాయి. ఉగ్ర మూకలు పెచ్చరిల్లుతున్నా చేష్టలుడిగి చూడటం తప్పితే అదుపు చేసే పరిస్థితి లేదు. వాటిపై చర్యలు తీసుకుంటే సైన్యం జోక్యం చేసుకుంటుంది… ఫలితంగా ప్రభుత్వాలు కుప్పకూలుతాయి. పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రులు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలిచడం లేదు.. ఇమ్రాన్‌ ప్రభుత్వంతో కలిపి గత నాలుగేళ్లలో నలుగురు ఆర్థిక మంత్రులు పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు  మిఫ్తా ఇస్మాయిల్‌ తో కలిపి ఐదుగురు ఆర్థిక మంత్రులు రాజీనామా చేసినట్లయింది. పాకిస్తాన్‌ ఆర్థిక మంత్రిగా పని చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే అంటున్నారు. కాగా మిఫ్తా స్థానంలో కొత్త ఆర్థిక మంత్రిగా పీఎంఎల్‌-ఎన్‌ నేత ఇషాక్‌ దార్‌ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read : బలోచిస్తాన్ లో హెలికాప్టర్ ప్రమాదం..సైనికుల మృతి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్