Allu-Kanagaraj: అల్లు అర్జున్ తన సినిమాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. బలమైన కథాకథనాలు .. పాతలో వైవిధ్యం ఉంటేనే తప్ప ఆయన అంగీకరించడం అసాధ్యం. ఇక ఆయన ఒక పట్టాన దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. తను ఇంతవరకూ చేసిన సినిమాలలో కంటే తనని కొత్తగా ఎవరూ చూపించగలరనే విషయంలో ఒక క్లారిటీ వస్తేనే ఆయన ఓకే అంటాడు .. లేదంటే లేదు. త్రివిక్రమ్ మాదిరిగా తనకి ఇష్టమైన దర్శకులతో పనిచేయడానికి కొంతకాలం వెయిట్ చేయడానికి కూడా ఆయన సిద్ధంగానే ఉంటాడు.
ఇక ఒక సినిమా షూటింగు జరుగుతూ ఉండగానే మరో ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ ఉంటుంది .. ఆ తరువాత ప్రాజెక్టుకి సంబంధించిన కథపై కసరత్తు జరుగుతూ ఉంటుంది. అలాంటి బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2‘ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే లైకా ప్రొడక్షన్స్ వారు బన్నీతో ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగారు. అట్లీ కుమార్ దర్శకత్వంలో వారు ఈ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే బన్నీ మాత్రం కుదిరితే లోకేశ్ కనగరాజ్ .. లేదంటే మురుగదాస్ ను లైన్లో పెట్టమని చెప్పినట్టుగా సమాచారం.
ఈ మధ్య కాలంలో తమిళనాట టాప్ డైరెక్టర్ గా లోకేశ్ కనగరాజ్ పేరు వినిపిస్తోంది. తన అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టిపడేస్తాడనే పేరుంది. అందువల్లనే కమల్ పిలిచిమరీ వందల కోట్ల ప్రాజెక్టును ఆయన చేతిలో పెట్టాడు. వాళ్ల కాంబినేషన్లో ప్రేక్షకులను పలకరించడానికి ‘విక్రమ్’ రెడీ అవుతోంది. ఇక తనతో ‘మాస్టర్’ చేసిన లోకేశ్ కనగరాజ్ తో మరో సినిమా చేయడానికి విజయ్ సిద్ధంగా ఉన్నాడంటే అతనిపై ఎంతటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి లోకేశ్ కనగరాజ్ ను లైన్లో పెట్టే పనిలో బన్నీ ఉన్నాడు. ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే మరో పాన్ ఇండియా సినిమాకి కొబ్బరికాయ కొట్టేస్తారు.
Also Read : కష్టాన్ని ఇష్టపడటమే అల్లు అర్జున్ స్పెషాలిటీ!