Friday, April 19, 2024
Homeసినిమాకష్టాన్ని ఇష్టపడటమే అల్లు అర్జున్ స్పెషాలిటీ!

కష్టాన్ని ఇష్టపడటమే అల్లు అర్జున్ స్పెషాలిటీ!

Hard Work as Policy: వెండితెరపై కనిపిస్తే చాలని అనుకునేవారు కొంతమందైతే, వెండితెరపై వెలిగిపోవాలని కోరుకునేవారు మరి కొంతమంది. బలమైన సినిమా నేపథ్యం కలిగినవారు ఎంతో అదృష్టవంతులు .. ఎలాంటి ఆటంకాలు లేకుండా సినిమాల్లోకి వస్తారు ..  ఎలాంటి కష్టాలు పడకుండా స్టార్ డమ్ ను సంపాదించుకుంటారని బయటవాళ్లు అనుకుంటూ ఉంటారు. ఇందులో ఒకటి మాత్రమే నిజం. బలమైన సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇవ్వడం చాలా తేలికనే. అయితే రెండవ సినిమా నుంచి ఫ్యామిలీ నేపథ్యం వర్కౌట్ కాదు. కుర్రాడు నిదానంగా అలవాటు పడతాడులే అనుకుని ఆడియన్స్ సర్దుకుపోరు .. సక్సెస్ ఇవ్వరు.

ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చినవారు ఇక్కడ సక్సెస్ కాకపోతే ఎవరూ పట్టించుకోరు. ‘పాపం బ్యాక్ గ్రౌండ్ లేదు కదా’ అనే అనుకుంటారు. అదే బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా కెరియర్ పరంగా ఎదగలేకపోతే అప్పుడు జనం మాట్లాడుకునే మాటలు వేరేగా ఉంటాయి. అందువలన బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లే ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. తమని తాము నిరూపించుకోవడానికీ .. నిలబడటానికి కసరత్తులు చేస్తూనే ఉండవలసి ఉంటుంది. అందుకు నిదర్శనంగా మనకి అల్లు అర్జున్ కనిపిస్తాడు.

 Allu Arjun

టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాతగా అల్లు అరవింద్ కి పేరు ఉంది. ఆయన స్థాపించిన గీతా ఆర్ట్స్ నుంచి ఎన్నో సక్సెస్ ఫుల్      సినిమాలు వచ్చాయి. అలాంటి  ఆయన వారసుడిగా బన్నీ తెరపైకి వచ్చాడు. ఇక మరో వైపున చిరంజీవి .. పవన్ కల్యాణ్ మేనల్లుడిగా కూడా ఆయనపై అంచనాలు ఉన్నాయి. ఒక వైపున తండ్రి పేరును .. మరో వైపున మెగాస్టార్ ఫ్యామిలీ బ్రాండ్ ను కాపాడవలసిన బాధ్యత ఆయనపై ఉంది. అలాంటి పరిస్థితుల్లో ‘గంగోత్రి’ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పుడు ఆయన లుక్ అంతంత మాత్రం. అయినా ఆయన తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

ఆ సినిమాలో అమాయకంగా .. కాస్త మెత్తగా కనిపించిన బన్నీ, ఆ తరువాత చేసిన ‘ఆర్య’ సినిమాతోనే ‘అసాధ్యుడు రా’ అనిపించుకున్నాడు. ‘దేశముదురు’ సినిమాతో ఆయన తన బాడీ లాంగ్వేజ్ ను .. డైలాగ్ డెలివరీని పూర్తిగా మార్చేసుకున్నాడు. డాన్సులతో అదరగొట్టేశాడు. మెగాస్టార్ మాదిరిగానే స్క్రీన్ పై చెలరేగిపోయాడు. యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ కి కూడా చేరువైపోయాడు. తన ప్రతి సినిమా అంతకుముందున్న సినిమాకంటే పూర్తి భిన్నంగా  ఉండాలి. అంతకుముందున్న సినిమాలో కంటే తాను కొత్తగా కనిపించాలి. అంతకుముందు చేసిన సినిమా కంటే  ఒక రూపాయి ఎక్కువే వసూలు చేయాలి అనే కాన్సెప్ట్ తో బన్నీ ముందుకు వెళ్లాడు.

లవ్  .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పండించడంలో తనకి తిరుగులేదనిపించుకున్నాడు. అందుకు నిదర్శనంగా ‘రేసు గుర్రం’ .. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ .. ‘సరైనోడు’ .. ‘దువ్వాడ  జగన్నాథం’ .. ‘అల వైకుంఠపురములో’ సినిమాలు కనిపిస్తాయి. ఇక ‘పుష్ప’ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

 Allu Arjun

‘అవకాశం ఉంది గనుక సినిమాల్లో వచ్చాడు .. చేస్తే  ఓ రెండు మూడు సినిమాలు చేస్తాడేమో’ అనుకున్నవారి అంచనాలను తలక్రిందులు చేశాడు. బలమైన నేపథ్యం  ఉందని బన్నీ కూల్ గా కూర్చోలేదు. తనని తాను మలచుకుంటూ .. గెలుచుకుంటూ వెళ్లిన తీరు ఆయన ప్రయాణంలో కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తనని తాను తీర్చిదిద్దుకున్న శిల్పం వంటివాడు బన్నీ. అలాంటి బన్నీ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : మాస్ యాక్షన్ హీరో కృష్ణంరాజు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్