Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Rebel Star: కృష్ణంరాజు అనే పేరు వినగానే గంభీరమైన రూపం .. చింతనిప్పుల్లాంటి కళ్లు .. ఉరిమే స్వరం గుర్తుకు వస్తాయి. మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీ .. నిబ్బరంతో నిలబడి ఆవేశంతో చెప్పే డైలాగ్స్ కళ్లముందు కదలాడతాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలతో, మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన హీరోగా ఆయన గురించి చెప్పుకోవచ్చు. కథలను .. పాత్రలను ఆయన ఎంచుకునే తీరు, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ‘రెబల్ స్టార్’ గా ఆయన నట ప్రయాణం సుదీర్ఘకాలం పాటు సాగేలా చేసింది.

పశ్చిమ గోదావరి జిల్లా .. ‘మొగల్తూరు’లో కృష్ణంరాజు పుట్టి పెరిగారు. శ్రీమంతుల కుటుంబంలో పుట్టిన ఆయన ఎలాంటి కష్టం తెలియకుండా పెరిగారు. చదువుకునే రోజుల నుంచి ఆయనకి ఫొటోగ్రఫీ హాబీగా ఉండేది. ఆ రోజుల్లోనే ఆయన ఖరీదైన కెమెరాలు వాడేవారు. ఆకర్షణీయమైన రూపం కావడంతో, అందరూ కూడా సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించేవారు. దాంతో ఆయనకి కూడా తెరపై కనిపించాలనే ఆసక్తి పెరుగుతూ వచ్చింది. దాంతో ఆయన మద్రాసు చేరుకుని, ఆ దిశగా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు.

‘తేనెమనసులు’ సినిమాలో హీరోగా కృష్ణను ఎంపిక చేసినట్టు చెప్పడంతో, వెనుదిరిగినవారిలో  కృష్ణంరాజు కూడా ఉన్నారు. అయితే చాలామంది హీరోల మాదిరిగా ఆయన సినిమా కష్టాలేమీ పడలేదు. ఆర్థికపరమైన ఇబ్బదులు మొదటి నుంచి కూడా లేకపోవడం వలన, చాలా కూల్ గానే అవకాశాల కోసం వెయిట్ చేసేవారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి ‘చిలకా గోరింకా’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. 1966లో వచ్చిన ఈ సినిమాకి ప్రత్యగాత్మ దర్శకత్వం వహించగా, కృష్ణంరాజు సరసన తొలి నాయికగా కృష్ణకుమారి నటించారు.

ఆ తరువాత కొన్ని సినిమాల్లో కృష్ణంరాజు నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ వెళ్లారు. అలా ఆయన విలన్ గా చేసిన సినిమాలలో ‘నేనంటే నేనే’ సినిమా మంచి పేరు తీసుకుని వచ్చింది. ఇక ఆ తరహా పాత్రలను చేస్తూనే ఆయన హీరో పాత్రలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు కేవలం మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేయగలడు అనే ప్రచారం మొదలైంది. అలాంటి ప్రచారానికి తెరదింపాలనే ఆలోచనతో ఆయన, ‘గోపీకృష్ణ మూవీస్’ పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసి క్లాస్ టచ్ ఇస్తూ ‘కృష్ణవేణి’ సినిమాను నిర్మించారు.

‘కృష్ణవేణి’ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు, కృష్ణంరాజు స్టార్ డమ్ ను పెంచేసింది. ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతును సంపాదించి పెట్టింది. ఆ బ్యానర్ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావడానికి కారణమైంది. అలా వచ్చిన ‘అమరదీపం’ .. ‘భక్త కన్నప్ప’ .. ‘సీతారాములు’ .. ‘కటకటాల రుద్రయ్య’ కృష్ణంరాజు సినిమాల పట్ల ఫ్యామిలీ ఆడియన్స్ మొగ్గు చూపేలా చేశాయి. ఆ సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా కూడా నిలవడం విశేషం. ఇక ‘భక్త కన్నప్ప’ కోసం అప్పట్లోనే అవుట్ డోర్ లో సెట్స్ వేసి భారీ స్థాయిలో చిత్రీకరించడం గురించి గొప్పగా చెప్పుకున్నారు.

అప్పట్లో శోభన్ బాబు .. కృష్ణ ఇద్దరూ కూడా కృష్ణంరాజుకు గట్టిపోటీ అయ్యుండేవారు. శోభన్ బాబు రొమాంటిక్ హీరోగా .. కృష్ణ యాక్షన్ హీరోగా చెరో దారిలో వెళుతున్నారు. అందుకు భిన్నంగా .. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా కృష్ణంరాజు మాస్ యాక్షన్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లారు. రౌద్రరసాన్ని ఆవిష్కరించడంలో తనకి  తిరుగులేదని పించుకున్నారు. ‘రంగూన్ రౌడీ’ .. ‘పులిబిడ్డ’ .. ‘త్రిశూలం’ .. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ వంటి సినిమాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలే ఆయనకు ‘రెబల్ స్టార్’ అనే పట్టం కట్టాయి.

ఇక ఒకానొక దశలో కృష్ణంరాజు చారిత్రక నేపథ్యంతో కూడిన ‘తాండ్ర పాపారాయుడు’ .. ‘విశ్వనాథనాయకుడు’ వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా కృష్ణంరాజు నట విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. అసమానమైన ఆయన నటనకు కొలమానంగా నిలుస్తాయి. ఆ తరువాత ఆయన ‘బావ బావమరిది’ సినిమాతోను, తనకి తిరుగులేదనిపించుకున్నారు. తెరపై రౌడీయిజం తరహా పాత్రల నుంచి రాజసం ఉట్టిపడే పాత్రల వరకూ తనకి ఎదురులేదనిపించుకున్నారు.

Uv Krishnam Raju

వి.మధుసూదనరావు .. బాపు .. దాసరి .. రాఘవేంద్రరావు .. పి.సి.రెడ్డి దర్శకత్వంలో కృష్ణంరాజు ఎక్కువ సినిమాలు చేశారు. వాణిశ్రీ .. శారద .. జయసుధ .. జయప్రద వంటి నాయికలతో ఆయన ఎక్కువ హిట్లు అందుకున్నారు.  కొంతకాలం పాటు రాజకీయాలలోను చురుకుగా పాల్గొన్న ఆయన, ఆ తరువాత అడపా దడపా సినిమాలలో కనిపిస్తూ .. సినిమాల నిర్మాణాలలో భాగమవుతూ వస్తున్నారు. అప్పట్లోనే మాస్ యాక్షన్ హీరోగా మంచి మార్కులు కొట్టేస్తూ మనసులను దోచేసిన కృష్ణంరాజు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేద్దాం.

(కృష్ణంరాజు జన్మదిన ప్రత్యేకం)

– పెద్దింటి గోపీకృష్ణ

Also Read : అజరామర కీర్తి సంపన్నుడు…

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com