Allyson Felix :
మొదట ఆమె ఒక సాధారణ అథ్లెట్
శిక్షణతో అయింది అసాధారణ ఛాంపియన్
స్పాన్సర్లకు బ్రాండ్ అంబాసిడర్
ఇప్పుడు తానే ఒక బ్రాండ్ ..
..ఇదీ అలిసన్ ఫెలిక్స్ జీవితం. అమెరికా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. ఒలింపిక్స్ చరిత్రలో మొత్తం 11 పతకాలు సాధించి ఇప్పటి వరకు అత్యధిక పతకాలు సాధించిన కార్ల్ లూయిస్ రికార్డు బ్రేక్ చేసింది. మొత్తం మీద కెరీర్లో 40 కి పైగా పతకాలు గెలుచుకుని అమెరికా బెస్ట్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గా చరిత్రలో నిలిచింది. కేవలం ఈమె విజయాల వల్లే ఇంత గుర్తింపు రాలేదు. మహిళలు, క్రీడాకారిణుల హక్కులపై గళమెత్తి మార్పు సాధించిన ధీర కూడా ఫెలిక్స్.
కంటికి కనిపించే గాయాలు తగ్గుతాయి. మనసు గాయాల మాటేమిటి? అసలు వాటి గురించి తెలుస్తుందా?తాజా గా ముగిసిన ఒలింపిక్స్ ఇటువంటి ఎన్నో సంచలనాలు బయటపెట్టింది. ట్విస్టీస్ అనే మానసిక రుగ్మత వల్ల తప్పుకున్న సిమోన్ బైల్స్ అందరి సానుభూతి పొందింది. ఎవరి మద్దతు లేకపోయినా తన స్పాన్సర్ వైఖరికి నిరసనగా తానే ఒక బ్రాండ్ గా మారింది ఫెలిక్స్ . తాజా ఒలింపిక్స్ లో పతకాలు సాధించి తన పోరాటం సరైందే అని నిరూపించింది.
Allyson Felix Become Inspiration To Other Athletes Who Achieved Gold After A Baby Girl :
క్రీడాకారులకు ఆట వస్తే సరిపోదు. తగిన శిక్షణ, సౌకర్యాలు అవసరం. షూస్, దుస్తులకే ఎంతో ఖర్చవుతుంది. ఇలాంటపుడు స్పాన్సర్ ద్వారా సహాయం అందుతుంది. ఆటగాళ్లు సాధించే విజయాల ద్వారా ఆయా కంపెనీలు ప్రకటనల రూపంలో ఆదాయం ఆర్జిస్తాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇందుకు కంపెనీలు పెట్టే నిబంధనలు కఠినంగా ఉంటాయి. అతిక్రమిస్తే ఆటగాళ్ల ఆదాయంలో కోత విధిస్తాయి. ఫెలిక్స్ ఫీలయింది ఇక్కడే. నైక్ కంపెనీ తో ఆమె ఒప్పందం చాన్నాళ్లు బాగానే సాగింది. 33 ఏళ్ళ వయసులో ఫెలిక్స్ తల్లి కావాలనుకుంది. అది నైక్ కంపెనీ కి నచ్చలేదు. ఆమె ఆదాయంలో 70 శాతం కోత విధిస్తున్నట్టు చెప్పారు. ఏ కంపెనీ మహిళల్ని ప్రోత్సహిస్తోందని భావించి చేతులు కలిపిందో వారే ఇటువంటి పని చెయ్యడం ఫెలిక్స్ ను ఆగ్రహానికి గురిచేసింది. ఈ విషయం పై పెద్దస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. నైక్ కి బై చెప్పి తనే శాష్ (says) అనే కొత్త బ్రాండ్ ప్రారంభించింది. తల్లి అయినా తనలో ప్రతిభకు లోటు లేదంటూ తాజా ఒలింపిక్స్ లో పతకాలు గెలిచి ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా అథ్లెట్ గా నిలిచింది. తన సొంత బ్రాండ్ షూ ధరించి ఆమె విజయం సాధించడం విశేషం. ఫెలిక్స్ పోరాటంతో నైక్ కూడా దిగివచ్చి తన పాలసీ మార్చుకుంది. ఇంటా బయటా కూడా విజయం సాధించిన ఫెలిక్స్ ఎందరికో స్ఫూర్తి దాత.
-కె. శోభ
Also Read : మన ఒలింపిక్స్ వేరు