‘అల్లూరి సీతారామరాజు’ .. కృష్ణ కెరియర్లో ఒక ప్రత్యేకమైన సినిమా. ఆయన కెరియర్లో మైలురాళ్లుగా నిలిచిన సినిమాలలో ఒకటి. ఈ సినిమాకి కృష్ణ నిర్మాతగానే కాదు, దర్శకుడిగా కూడా వ్యవహరించారు. వి. రామచంద్రరావు దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా, కృష్ణ దర్శకత్వంలోనే పూర్తయింది. కృష్ణ సొంత బ్యానర్లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా ఇది. త్రిపురనేని మహారథి అందించిన స్క్రిప్ట్, ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది.
కృష్ణ లుక్ .. ఆయన డైలాగ్ డెలివరీ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ‘అల్లూరి సీతారామరాజు’ అంటే కృష్ణనే అనేంతగా ఆ పాత్రలో ఆయన ఇమిడిపోయారు. అందువల్లనే కృష్ణతో పాటు ఈ కథను తెరపైకి తీసుకురావాలనుకున్న కొంతమంది హీరోలు, ఆ తరువాత ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అప్పట్లోనే విడుదలైన అన్ని ప్రాంతాలలోను ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. అలాంటి ఈ సినిమా నిన్నటితో 50 ఏళ్లను పూర్తిచేసుకుంది.
ఈ సందర్భంగా ఈ విషయంపై మహేశ్ బాబు స్పందించాడు. ఈ సినిమాలో తన తండ్రి గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి తాను ఆశ్చర్యపోయానని ట్విట్టర్ ద్వారా చెప్పాడు. ఈ సినిమా నటుడిగా తన ప్రయాణంపైనే కాకుండా, తెలుగు సినిమాపై కూడా ఎంతో ప్రభావం చూపించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా ఎంతగా ప్రభావితం చేసిందనే విషయాన్ని గుర్తుచేసుకుంటున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఆయన తాజా చిత్రం రాజమౌళి దర్శకత్వంలో ఉందనే విషయం తెలిసిందే.