Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Ashok Galla Introducing As Hero :

సినిమాల్లో హీరో కావాలంటే ఎంత పొడుగు ఉండాలి? చిదిమి దీపం పెట్టుకునేంత నున్నని పాల బుగ్గలు ఉండాలా? డూప్ లేకుండా దుస్సహ యుద్ధ విద్యలు ప్రదర్శించగలిగే తెగువ ఉండాలా?

ఏమంటివి? ఏమంటివి ?
జాతి నెపమున సూత సుతునకిందు
నిలువ అర్హత లేదందువా ….!
ఎంత మాట ఎంత మాట !!

లాంటి నోరు తిరగని సుదీర్ఘ డైలాగులను గుక్క తిప్పుకోకుండా చెప్పడం రావాలా? ఫొటోజెనిక్ ఫేస్ ఉండాలా? ముఖ కవళికల్లోనే కోటి భాషలు పలికించగల ఎస్వీ ఆర్ లా ఉండాలా? ఒళ్లంతా ఎక్కడికక్కడ సిక్స్ సెవెన్ ఎయిట్ ప్యాకుల కండలు బండల్లా ఉండాలా?

నిజానికి నేటి హీరోకు ఈ లక్షణాలన్నీ మైనస్. తెలుగు హీరోకు మొట్టమొదటి అర్హత తెలుగు రాకూడదు. తెలుగును ఇంగ్లీషులో రాసుకుని, తెలుగును ఇంగ్లీషులా మాట్లాడగలిగితే మన హీరోకు పరీక్ష రాయకుండానే సగం మార్కులు పడ్డట్టు. నిజానికి ఎలాంటి పరీక్షలు రాయకపోవడం అన్నది హీరోకు ఉండాల్సిన అదనపు అర్హత. హీరోకు కథ వేరొకరు రాస్తారు. హీరోకు మాటలు మరెవరో రాస్తారు. హీరో పాట ఇంకెవరో పాడతారు. కాబట్టి హీరో ఏదీ రాయడు. రాయకూడదు. జుట్టుకు రంగు తప్ప హీరో ఇంకేది రాసినా అభిమానుల హృదయం ముక్కలు ముక్కలవుతుంది.

చదువు సంధ్యలు లేనివారు, అక్షరం ముక్క రానివారే హీరోలు కాగలరు అని సాధారణీకరించకూడదు. వారు ప్రేక్షకలోకాన్ని చదువుతారు. ఘటనాఘటన నటనాక్షరాలను దిద్దుకుంటారు. తెర మీద మన హీరోలు నారాయణ- చైతన్య నిత్య విద్యార్థులే. హీరోలు చదవాల్సిన వయసులో చదవకపోవడం వల్ల అరవైలు మీద పడి పళ్లూడి, జుట్టు నెరిసి, చర్మం ముడుతలు పడుతున్నా ఇంటర్మీడియెట్ క్లాస్ రూములు ఎక్కడ ఉన్నాయో నటనగా అయినా వెతుక్కోవాల్సి వచ్చింది.

హీరోల కొడుకులు కూడా హీరోలే కావాలి కాబట్టి చదువుతో వారి ఆగర్భ శత్రుత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. నిర్మాత కొడుకు హీరోనే కావాలి కాబట్టి ఆ పురుషోత్తములు కూడా మధ్యలోనే అసంకల్పితంగా కాలేజీ మానేయాల్సి వస్తుంది. డిస్టిబ్యూటర్ కొడుకులు, హాస్యనటుల కొడుకులు...ఇలా అందరి కొడుకులు హీరోలే అయి మనల్ను ఎంటర్ టైన్ చేయాలని మనమే వాళ్ల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డాం కాబట్టి ఈ కొడుకులందరూ హీరోలే అవుతారు. లేదా హీరోలు అయ్యామని అనుకుంటారు.

హీరో కావాలని అనుకోవడానికి- హీరో కావడానికి చాలా తేడా ఉంది. అనుకోవడం వారి జన్మ హక్కు. జన్యుగతమయిన విషయం. కావడం ఖర్మఫలం. అనేక గ్రహాల అనుగ్రహం. ముఖ్యమంత్రి కొడుకు హీరో అవగానే, ఆ ముఖ్యమంత్రి ప్రజాజీవితంలో నటించినట్లే, సినిమా ఫంక్షన్లలో నటించడం మొదలుపెడతాడు. ఆయనకు నటన వెన్నతో పెట్టిన విద్య. మరొకరు తెర మీద ముఖ్యమంత్రి అవుతున్న పాత్రలు వేసి వేసి…బయట నిజంగా తనే కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటూ కార్ల కాన్వాయ్ మధ్య నటిస్తుంటాడు. లేదా భ్రమిస్తుంటాడు.

“నరుడి బ్రతుకు నటన .. ఈశ్వరుడి తలపు ఘటన ..
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన?
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా?
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా?”

జూబ్లీహిల్స్ లో మూతి మీద మీసం మొలిచిన పిలగాళ్లందరూ హీరోలే. మన పూర్వజన్మల పుణ్యకర్మ/ఖర్మ ఫల విశేష ప్రారబ్దానికి వీరందరూ ప్రతిరూపాలే. ఏదయినా అనుభవిస్తేనే పాపక్షయమవుతుంది. ఈ హీరోలను భరించడం ద్వారా మన పాపక్షయం కాకుండా పోదు. మన పాపం పండినప్పుడు వారేమి చేయగలరు…పాపం! అన్నట్లు సూపర్ స్టార్ హీరో కృష్ణ మనవడు, హీరో మహేష్ బాబు మేనల్లుడు, పెద్ద పారిశ్రామికవేత్త, పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కొడుకు హీరోగా వస్తున్నాడు. అందరూ దూరం జరగండి. మరి ఆ బ్లడ్డూ…ఆ బ్రీడూ…

గల్లా హీరో రాజా!
హాయిగా అమర రాజా బ్యాటరీలను రీ ఛార్జ్ చేసుకుంటూ సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుకోకుండా… ఎందుకు బాబూ మేమంటే అంత ఇది నీకు!

-పమిడికాల్వ మధుసూదన్

Must Read : మేనల్లుడి టీజర్ విడుదల చేయనున్న మహేష్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com