Save Amaravathi:
‘అమరావతిని కాపాడుకుందాం – ఆంధ్ర ప్రదేశ్ ను కాపాడుకుందాం’ అని ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. అమరావతి ఐదుకోట్ల మంది రాజధాని… ప్రజా రాజధాని అని అయన స్పష్టం చేశారు. అమరావతిపై కులం ముద్రవేయడం సమంజసం కాదన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహోద్యమ సభలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అమరావతి ఉద్యమం ఐదు కోట్ల ఆంధ్రుల కోసం చేస్తున్నదని, ఈ ఆందోళన 725 రోజులకు చేరిందని, దాదాపు 180 మంది రాజధాని కోసం అమరులయ్యారని పాదయాత్ర సమయంలోనే 2500 మందిపై 100 కేసులుపెట్టారని, 500 మందిని జైల్లో పెట్టారని బాబు చెప్పారు. రాజధాని రైతులు చేసిన పాపమేమిటని బాబు ప్రశ్నించారు. ఇన్ సైడర్ అనే పదమే లేకపోయినా అమరావతిలో ఏదో జరిగిపోయిందని దుష్ప్రచారం చేశారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని, రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలన్నది నినాదం కావాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతిలోనే రాజధాని ఉండాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా స్పష్టంగా చెప్పిందని, రాజకీయాలకు అతీతంగా రాజధానిపై అందరం కలిసి ఒకే వేదిక మీదకు వచ్చామని, సైద్ధాంతికంగా విభేదించినా బిజెపి, కమ్యూనిస్టులు కూడా కలిసి వచ్చారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా నిర్ణయించామని, నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి ఒప్పుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులంటూ చెప్పడం దారుణమన్నారు.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు పోటీగా నిన్న పోటీ సభ పెట్టారని, ఆ సభలో పాల్గొన్న విద్యార్ధులు కూడా జై అమరావతి నినాదాలు చేశారని గుర్తు చేశారు.