పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు అమరిందర్ సింగ్ ప్రకటించారు. రాజ్ భవన్ లో గవర్నర్ బన్వరి లాల్ పురోహిత్ ను కలిసి తన రాజీనామాతో పాటు మంత్రివర్గ సహచరుల రాజీనామా పత్రాలను అందచేశారు. పార్టీలో తనకు తగిన గౌరవం దక్కలేదని, పార్టీ అధిష్టానం నా మాటలు పట్టించుకోకుండా అవమానకరంగా వ్యవహరించిందని అమరిందర్ అన్నారు. అంతకు ముందు చండీగడ్ లో తన మద్దతుదారులు, కొందరు ఎమ్మెల్యేలతో అమరిందర్ సమావేశమయ్యారు. రాజీనామాకు దారితీసిన పరిస్థితుల్ని సమావేశంలో వివరించారు.
నవజోత్ సింగ్ సిద్దు పిసిసి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగాయి. పంజాబ్ కాంగ్రెస్ లో సమస్యలు సద్దుమనగలేదని గత నెల 25 వ తేదిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ హరీష్ రావత్ తెలిపారు. ఈ నెల 8 వ తేదిన డెహ్రాడున్ వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజిందర్ సింగ్ బజ్వా, సుఖ్బిందర్ సింగ్ సర్కారియా, సుఖ్జిందర్ సింగ్ రంధ్వా, చరణ్ జిత్ సింగ్ చన్నిలు హరీష్ రావత్ ను కలిసి అమరిందర్ ను మార్చాలని డిమాండ్ చేశారు.
అమరిందర్ సింగ్ 1965 ఇండో పాక్ యుద్దంలో కెప్టెన్ గా వ్యవహరించారు. పంజాబ్ 26 వ ముఖ్యమంత్రిగా 2017లో బాధ్యతలు చేపట్టిన అమరిందర్ సింగ్ 2010 నుంచి 2013 వరకు పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించారు. మరి కొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండగా అమరిందర్ సింగ్ రాజీనామా చేయటం కాంగ్రెస్ కు ఎంతవరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.
రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతోంది.