అమెజాన్‌కు చెందిన వేలాది మంది కార్మికులు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేపట్టారు. వేతనాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలన్న డిమాండుతో దాదాపు 40 దేశాల్లోని అమెజాన్ వేర్‌హౌస్‌ల ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. అమెజాన్ ప్లాట్‌ఫాంపై ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ రోజునే కార్మికులు సమ్మెకు దిగడం గమనార్హం. ‘మేక్ అమెజాన్ పే’ క్యాంపెయిన్‌లో భాగంగా కార్మికులు పని ఆపేసి తమ గళం వినిపించారు.
భారత్‌తో పాటు అమెరికా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే తదితర దేశాల్లో కార్మికులు ఆందోళనలు చేశారు. యూకేలో జీఎంబీ యూనియన్‌కి చెందిన వందలాది మంది సభ్యులు కొవెంట్రీతోపాటు పలు నగరాల్లోని అమెజాన్ వేర్‌హౌస్‌ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, వేతనాల పెంపు, మెరుగైన పని పరిస్థితులు కల్పించేందుకు యూనియన్లతో చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. క్రిస్మస్ సీజన్ నేపథ్యంలో ఓవర్‌టైమ్‌కు అనుగుణంగా బోనస్ ఇవ్వాలన్నారు. ‘పని బారెడు, వేతనం మూరెడు’లా కార్మికుల దుస్థితి ఉన్నదని జీఎంబీ నేత అమంద గేరింగ్ పేర్కొన్నారు. భారత్‌లో ఢిల్లీ జంతర్‌మంతర్‌తో పాటు యూపీ, ఉత్తరాఖండ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో ఆందోళనలు జరిగాయి.
ఎవరినీ బలవంతంగా తొలగించలేదు
భారత్‌లో తాము ఏ ఉద్యోగినీ బలవంతంగా తొలగించలేదని, తాము ఇచ్చిన ప్యాకేజీని అంగీకరించి కొందరు ఉద్యోగులు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగారని అమెజాన్ పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖకు సమాధానం ఇచ్చింది. ఏటా అన్ని విభాగాల్లోని ఉద్యోగులపై సమీక్ష నిర్వహిస్తుంటామని, పునర్వ్యవస్థీకరణ అవసరమని భావిస్తే పరిహారం చెల్లిస్తుంటామని పేర్కొన్నది. ఇందులో బలవంతం ఏమీ లేదని, తమ ప్యాకేజీని అంగీకరిస్తే ఉద్యోగులు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలగవచ్చని, లేదంటే ప్యాకేజీని తిరస్కరించే వెసులుబాటును ఉద్యోగులకు కల్పిస్తున్నామని అమెజాన్ పేర్కొన్నది. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అమెజాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ప్రక్రియలో భాగంగా వేతన సంబంధిత ప్రయోజనాలను తీసుకొని స్వచ్ఛందంగా ఉద్యోగాల నుంచి వైదొలగాలని ఆ కంపెనీ భారతీయ ఉద్యోగులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. వలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్ (వీఎస్‌పీ)కు సానుకూలంగా ఉన్నవారు ఈ నెల 30లోగా సంతకం చేయాలని, ఈ గడువులోగా సంతకం చేసినవారు మాత్రమే వేతన ప్రయోజనాలను పొందేందుకు అర్హులని అమెజాన్ స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో అమెజాన్ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెనేట్ (ఎన్‌ఐటీఈఎస్) ఇటీవల కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది.