Saturday, November 23, 2024
HomeTrending Newsమీరేమైనా టెర్రరిస్టులా? అంబటి ప్రశ్న

మీరేమైనా టెర్రరిస్టులా? అంబటి ప్రశ్న

JInnah Tower: జిన్నా టవర్‌ను పేల్చడానికి మీరు ఏమైనా టెర్రరిస్టులా? అసాంఘిక శక్తులా? అని బిజెపి నేతలను ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆప్ఘనిస్తాన్‌లో బుద్దుడి విగ్రహాన్ని తాలిబన్లు పేల్చేశారని, వారికి మీకు తేడా ఏమిటని నిలదీశారు. అద్వానీ జిన్నా సమాధి వద్దకు వెళ్లి పుష్పగుచ్చం ఉంచి, ఆయన్ను నిజమైన దేశభక్తుడు అని కీర్తించిన సంగతి మర్చిపోయారా? ఆ మాటలు అన్నందుకు ఇప్పుడు అద్వానీ మీద తిరగబడతారా? లేకుంటే ఆయన మీ పార్టీ కాదని చెబుతారా? అని బిజెపి నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్ళు అయిన సందర్భంగా… ఒకవైపు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం జరుపుకుంటూ సారా బుడ్డిల గురించి, జిన్నా టవర్‌ గురించి మాట్లాడుకునేంత నీచానికి దిగజారిపోయారని అంబటి  ధ్వజమెత్తారు. ‘జిన్నా టవర్‌  కూలుస్తాం, పేలుస్తామంటే.. వారి పాత మిత్రుడు చంద్రబాబు నోరు తెరిచి మాట్లాడరు. కొత్తమిత్రుడు పవన్‌ కల్యాణ్‌ కూడా నోరువిప్పరు. చివరకు కమ్యూనిస్టులు కూడా ఖండించడం లేదు’ అని దుయ్యబట్టారు.

వంగవీటి రాధా మీద రెక్కీ జరిగిందన్న ఘటనపై విచారణ జరుగుతోందని, డిపార్ట్‌మెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా యాక్షన్‌ తీసుకుంటామని, ఎవరి మీద ఎవరు హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, చట్టప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

హత్యా రాజకీయాలు చేసి, రాజకీయ లబ్ది పొందాలనే సంస్కృతి చంద్రబాబుకు, ఆ పార్టీకే ఉందని, అలాంటి అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు కుటిల రాజకీయాల కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారని రాంబాబు అన్నారు.

2021లో వైయస్ఆర్సీపీకి ఎన్నో విజయాలు వచ్చాయని, ఇది జగన్ గారికి అభివృద్ధి నామ సంవత్సరం.. బాబుకు ఏడుపు నామ సంవత్సరం, ప్రతిపక్షాలకు కడుపుమంట నామ సంవత్సరం అని రాంబాబు అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రాంబాబు.

మద్యం విధానంలో మార్పులపై స్పందిస్తూ మందుబాబులను ప్రోత్సహించాలని మా ఉద్దేశం కాదని, సమాయనుకాలంగా ఎక్సైజ్‌ పాలసీ మారుతూ ఉంటుందని వివరణ ఇచ్చారు. దశల వారీగా మద్య పానం నియంత్రించడంలో భాగంగా మొదట ధరలు పెంచారని, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం వస్తుంటే, దానిని నిరోధించేందుకు తగ్గించారని, దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అంబటి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్