Sunday, October 6, 2024
HomeTrending Newsబాబుది నిలువెల్లా విషమే: అంబటి రాంబాబు

బాబుది నిలువెల్లా విషమే: అంబటి రాంబాబు

తనకు ఓ విజన్ ఉందని చెబుతున్న చంద్రబాబు అదేంటోమాత్రం చెప్పడం లేదని, అందితే జుట్టు- అందకపోతే కాళ్ళు అనేదే ఆయన విజన్ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్మెంట్ లో తప్పుచేసి ఆధారాలతో పట్టుబడి 53 రోజులపాటు జైల్లో ఉన్న చంద్రబాబు అనారోగ్యం సాకుతో బైటకు వచ్చారని, కానీ విడుదలైన తరువాత ఎలాంటి అనారోగ్యం కనిపించడంలేదని విమర్శించారు. లోపల ఉన్నప్పుడు ఏడుపులు-పెడబొబ్బలు, బైటకు వచ్చిన తరువాత అరుపులు-కేకలు అన్న చందంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో దస్తాలు దస్తాల మేనిఫెస్టో విడుదల చేస్తారని.. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మేనిఫెస్టోను కనపడకుండా చేయడమే ఆయన విజన్ అని రాంబాబు అన్నారు. అలాంటి బాబు తనది విజన్- జగన్ ది పాయిజన్ అంటున్నారని, 2.53 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేదలకు ఇస్తే అది పాయిజన్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిలువెల్లా విషం నిండిన వ్యక్తి చంద్రబాబు అని అభివర్ణించారు.

భీమిలిలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన సిద్ధం బహిరంగసభ వైసీపీ కేడర్ లో నూతనోత్తేజాన్ని కలిగిస్తే ప్రత్యర్థి పార్టీల గుండెల్లో దడపుట్టించిందని అన్నారు. నాలుగున్నరేళ్లుగా తమ పాలనలో ప్రజలకు ఏమి చేశామో జగన్ వివరించారని, మరోవైపు 14 ఏళ్ళపాటు సిఎంగా పనిచేసిన చంద్రబాబు పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని జగన్ సూటిగా ప్రశ్నిస్తే సూటిగా సమాధానం చెప్పకుండా చంద్రబాబు పారిపోతున్నారని, ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. తాము కూడా సిద్ధం అని బాబు-పవన్ చెబుతున్నారని కానీ దేనికో చెప్పడంలేదని, ఎన్నికల తరువాత తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ దేనికి సిద్ధంగా ఉన్నారని, బాబును భుజాన వేసుకొని మోయడానికా…పోటీ చేయడానికా, ముఖ్యమంత్రి కావడానికా అని అంబటి ప్రశ్నించారు.

సిఎం జగన్ బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో నిధులు జమ చేశారని…. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ బటన్ మీద నొక్కి మరోసారి జగన్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్