అంతర్జాతీయంగా చైనాను ఏకాకిని చేసేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే జపాన్, తైవాన్ దేశాలకు అండగా నిలిచినా అమెరికా తాజాగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్‌కు అండగా నిలిచింది. అరుణాచల్ భారత్‌లో అంతర్భాగమేనని ఆ దేశ విదేశీ సంబంధాల కమిటీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని సెనేట్‌లో రెండు రోజుల కిందట ప్రవేశపెట్టింది. ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన భాగస్వాములతో సహకారాన్ని పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నట్టు తీర్మానం పేర్కొంది.
మెక్ మోహన్ లైన్ అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించాలని, చైనా దుందుడుకు చర్యల వాళ్ళ ఆసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రాథమికంగా ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. త్వరలో పూర్తిస్థాయి వోటింగ్ నిర్వహించనున్నారు. పూర్తి స్థాయి వోటింగ్ లో ఆమోదం పొందితే అరుణాచల్ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు అమెరికా సాయం చేసే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో పొరుగు దేశాలతో అమెరికా సరిహద్దు వివాదాలకు దిగటం పరిపాటిగా మారింది.