Amith Shah Directed Ap Bjp Leaders To Strengthen The Party :
రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేలా అడుగులు వేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న అమిత్ షా నేడు తిరుపతిలోని తాజ్ హోటల్ లో రాష్ర బిజెపి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేతలకు మార్గ నిర్దేశనం చేశారు. తటస్థులను, కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని, తెలుగుదేశం పార్టీతో సమదూరం పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ నేతలు సంతోష్ జీ, శివ ప్రకాష్ జీ, సునీల్ దియోధర్, పురంధేశ్వరి, సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు జీవీల్ నరసింహారావు, సుజనా చౌదరి, సిఎం రమేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.
అంతకుముందు గిరిజన వీరుడు, స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి అమిత్ షా పూలమాల వేసి నివాళులర్పించారు. బిర్సా ముండా జయంతిని కేంద్రం ‘జన జాతీయ గౌరవ దివస్’ గా జరపాలని నిర్ణయించిందని చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం నెలకొని ఉందని, కొత్తవారిని పార్టీలో చేర్చుకొని, 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారని సోము వెల్లడించారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయించేందుకు హామీ ఇచ్చారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై అమిత్ షా తో చర్చించామని, 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చిందని, పురందేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదని, దీనిపై కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Also Read : శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా