ఆఫ్ఘన్లో ప్రబలుతున్న అంటువ్యాధులు

Measles Prevalent In Afghanistan :

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు వశం చేసుకుని అధికారంలోకి వచ్చాక రోజుకో సమస్య ఎదురవుతోంది. ఇసిస్ దాడులతో ఓ వైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆహార సమస్య వేధిస్తోంది. పాకిస్తాన్ తప్పితే అధికారికంగా ఏ దేశం తాలిబాన్ల పాలన గుర్తించలేదు. ఐక్యరాజ్యసమితి తో పాటు యూరోప్ దేశాలు తాలిబన్లతో సంబంధాలకు విముఖంగా ఉన్నాయి. దీంతో దేశంలో అనేక కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోయాయి.

ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇవ్వాల్సిన టీకా పంపిణి ఆగిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా తట్టు వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. మీజిల్స్ అంటువ్యాధి కావటంతో చిన్నారుల పాలిట మృత్యుపాశంలా మారింది. దీనికితోడు దేశంలో మీజిల్స్ కట్టడికి టీకాలు అందుబాటులో లేక నెల రోజుల్లోనే సుమారు వందమంది చిన్నారులు చనిపోయారు. తట్టు వ్యాధితో అల్లాడిపోతున్న చిన్నారులతో కాబుల్ లోని ఇందిరా గాంధి పిల్లల ఆస్పత్రి కిక్కిరిసి పోయింది.

ఐదేళ్ళలోపు చిన్నారులకు తట్టు వ్యాధి వస్తుంది. దీని కట్టడికి టీకా ఇవ్వటమే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వర్గాలు వెల్లడించాయి. తాలిబాన్ పాలకులు సహకరించక పోవటంతో చిన్నపిల్లల టీకాలతో పాటు కరోనా వ్యాక్సినేషన్ జరగటం లేదని W.H.O వర్గాలు తెలిపాయి.

Also Read : ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్న తాలిబన్‌ అగ్రనేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *