పశ్చిమబెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించిన దుండగుడు విద్యార్థులను బందీలుగా చేసుకునేందుకు ప్రయత్నించాడు. మాల్డా జిల్లాలోని ముచియా ఆంచల్ చంద్రమోహన్ హైస్కూల్‌లోని ఓ తరగతి గదిలోకి సాయుధుడైన ఓ వ్యక్తి ప్రవేశించాడు. తుపాకీ చేత పట్టుకుని అక్కడే న్యూస్ పేపర్ చదవడం ప్రారంభించాడు. గమనించిన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్కూల్‌కు చేరుకున్నారు. ఆ వ్యక్తి నుంచి తుపాకీతోపాటు కొన్ని బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు. వాటిని పెట్రోల్ బాంబులుగా గుర్తించారు.
Malda: మాల్డా పాఠశాలలో తుపాకీతో దుండగుడు
అతని మానసిక స్థితి బాగాలేదని పోలీసుల విచారణలో తేలిందని మాల్డా ఎస్పీ ప్రదీప్ కుమార్ యాదవ్ చెప్పారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకుండా అతడిని అరెస్టు చేశామని తెలిపారు. భార్యతో ఉన్న సమస్యల కారణంగానే పిల్లలను బందీలుగా చేసుకోవాలని ప్రయత్నించినట్లు వెల్లడించారు. కాగా, తన భార్య.. తన కొడుకును తీసుకుని వెళ్లిపోయిందని, ఈ విషయమై పోలీసులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా ఎలాంటి సహాయం లభించలేదని విచారణ సందర్భంగా తెలిపాడు.