Sunday, January 19, 2025
HomeTrending Newsజీవితాల్ని మార్చేసిన ప్రశ్న

జీవితాల్ని మార్చేసిన ప్రశ్న

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది..

ఒక పొరపాటు జీవితాన్ని చిదిమేస్తుంది…

.. పై రెండు వాక్యాల్లో మొదటిది మనకు తెలిసిందే. తెలీనిదల్లా ఆ ఐడియా బెడిసికొడితే జీవితం ఎలా తలకిందులవుతుంది అనేదే. అది తెలియాలంటే  కేరళకు చెందిన టీ.జే జోసెఫ్ గురించి తెలుసుకోవాలి. చేయని తప్పు ఆయన జీవితాన్ని ఎలా తొక్కేసిందో గ్రహించాలి. లౌకిక భారతదేశంలో మతం ఎంత మత్తెక్కిస్తుందో, విచక్షణ కోల్పోయేలా చేస్తుందో బుర్రకెక్కించుకోవాలి. కొందరు వ్యక్తులు  స్వార్థంతో మతం పేరిట సాగించే మారణకాండ ఒక కుటుంబాన్ని ఎలా వెంటాడిందనేందుకు జోసెఫ్ జీవితం నిదర్శనం.

ఒక కాలేజీలో మలయాళం అధ్యాపకుడిగా, భార్య, ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోయే జీవితం జోసెఫ్ ది. ఒకానొక సెమిస్టరు పరీక్షలో భాగంగా ప్రముఖ రచయిత పీటీ కుంజు మొహమ్మద్ రాసిన నాటకంలో కొంత భాగం ప్రశ్నగా రూపొందించారు. ఇద్దరి మధ్య సంభాషణ రూపంలో ఉన్న ఈ ప్రశ్నలో దేవునితో మాట్లాడే వ్యక్తిని రచయిత పేరుతో సంబోధించారు. అయితే అది ఒక మతం వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని గొడవ మొదలైంది. తన తప్పు లేదని నిరూపించుకునే అవకాశం జోసెఫ్ కు దక్కలేదు. ఆయన మాటలు ఎవరూ వినిపించుకోలేదు. అరెస్ట్ వారంట్ ఇచ్చారు. కాలేజీ ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది. అరెస్టయి బెయిల్ పైన బయటకు వచ్చిన జోసెఫ్ కు తాను నమ్మిన చర్చ్ నుంచి కూడా సహాయం అందలేదు. పైగా మతోన్మాదుల దాడిలో ఆయన చేతి వేళ్ళు తెగిపోయాయి. కాలిపై కత్తితో పొడిచారు. తెగిన వేళ్ళను అతి కష్టంపైన అతికించి చికిత్స చేసినా ఇప్పటికీ అన్నివేళ్ళు పని చెయ్యవు.

ఉద్యోగం పోవడంతో తిండికి కూడా జరుగుబాటు కష్టమైంది. స్నేహితుల సాయంతో గడిపారు. ఈ బాధతో జోసెఫ్ భార్య ఆరోగ్యం దెబ్బతింది. ఓ పక్క ఉద్యోగం కోసం కోర్టుకు,భార్యను తీసుకుని ఆస్పత్రికి తిరగాల్సిన పరిస్థితి. పిల్లల చదువులు ఆగిపోయాయి. అయినా తప్పు చేయలేదనే నమ్మకంతో జోసెఫ్ పోరాడారు. కానీ ఇదంతా తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు జోసెఫ్ కు మద్దతుగా సమాజం కదిలింది. కాలేజీ వారు దిగి వచ్చి ఆయన రిటైర్మెంట్ కు ఒకే ఒక్కరోజు ముందు ఆర్డర్ ఇచ్చారు. తనపై నమోదైన కేసుల్లో  కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసారు. అయితే కొందరు వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మలైన వారిపై తనకేం కోపం లేదంటారీయన. వారికన్నా తన వారనుకున్నవారి నిర్లక్ష్యమే ఎక్కువ బాధించిందంటారు. మెల్లగా గాయాల నుంచి కోలుకున్నాక తాను చెప్పేది అందరికీ చేరాలంటే రచనే మార్గమని తన ఆత్మకథ ‘అట్టు పోకథ ఓర్ మకల్’ రాశారు. 2020 లో కేరళలో అత్యధికంగా అమ్ముడైన రచనల్లో ఇది ఒకటి. దీన్నే నందకుమార్  ఇంగ్లీష్ లో ‘ ఎ థౌసండ్ కట్స్, యాన్ ఇన్నోసెంట్ క్వశ్చన్ అండ్ డెడ్ లీ ఆన్సర్స్ ‘ పేరిట ఇటీవల అనువదించారు.

ప్రస్తుతం జోసెఫ్ తేరుకున్నారు. ఒక్కచేత్తోనే డ్రైవింగ్ తో సహా అన్ని పనులూ చేసుకుంటారు. ఆయన కుటుంబమూ కోలుకుంది. కానీ మనసుకైన గాయాలు మానడం కష్టమంటారు జోసెఫ్. మరో అవకాశం వస్తే ప్రశ్నలో పాత్రకు తన పేరు పెట్టుకుంటాననే ఈ ప్రొఫెసర్ తన కథ చదివి ఏ ఒక్కరు ఆలోచించినా చాలంటారు. ఇదంతా తెలిశాక భారతదేశంలో మత సామరస్యం నివురుకప్పిన నిప్పులాంటిదనే జోసెఫ్ మాటలు అక్షర సత్యాలు అనిపించక మానవు. ఆయన పడిన కష్టాలకు, మానసిక వేదనకు ఎవరు పరిహారం ఇవ్వగలరు?.

( సోర్స్- టైమ్స్ ఆఫ్ ఇండియా )

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్