టిడిపిలో చేరుతున్నా: ఆనం ప్రకటన

తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు.  ఈవారం నెల్లూరులో ప్రారంభం కానున్న నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తామని… ఈ యాత్ర  పూర్తయిన మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతామని వెల్లడించారు. ఈ ఉదయం నెల్లూరులోని తన నివాసంలో టిడిపి నేతలకు అల్పాహార విందును ఆనం ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో టిడిపి అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకుని చర్చలు జరిపిన ఆనం ఈ ఉదయం  నెల్లూరు వచ్చారు. అనంతరం టిడిపి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు సంతోషంగా పార్టీలోకి ఆహ్వానించారని ఆనం చెప్పారు.

మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి; మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, బిసి జనార్ధన్ రెడ్డి లు ఈ భేటీలో పాల్గొన్నారు.  లోకేష్ పాదయాత్ర ఆత్మకూరు నియోజకవర్గం ద్వారా జిల్లాలో ఈనెల 13న ప్రవేశిస్తుందని, దాదాపు నెలరోజులపాటు యాత్ర జిల్లాలో సాగుతుందని, ఇదే సమయంలో ఆనం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం శుభసూచకమని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయారని,  రాబోయే రోజుల్లో పెద్ద మార్పులు రాష్టంలో జరగబోతున్నాయని, జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పార్టీలో చేరుతున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *