తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు ఇకపై సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దంటూ ప్రివిలేజ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని రేపల్లె ఎమ్మెల్యే, టిడిపి నేత అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
మద్యం షాపుల విషయమై అచ్చెన్నాయుడు, పెన్షన్లపై నిమ్మల సభను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారంటూ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై చర్చించిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇకపై సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని…. ఈ మేరకు చర్య తీసుకోవాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు సిఫార్సు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు కూడా అయిన సత్య ప్రసాద్ ఈ నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు, దీనిపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డికి నేడు లేఖ రాశారు.
సభలో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, సభ్యుల నుంచి సరైన వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని సత్య ప్రసాద్ ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు, అందులోనూ తమ పార్టీ శాసనసభాపక్ష ఉప నేతలకు కూడా మాట్లాడే అవకాశం లేకుండా తీసుకున్న నిర్ణయంపై అయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ విషయమై పునరాలోచన చేయాలని లేఖలో కోరారు.
గత సభలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియం ఎక్కి నిరసన చేయలేదా అంటూ సత్య ప్రసాద్ ప్రశ్నించారు. ప్రజ్యాస్వామ్య వ్యవస్థలో దేవాలయాలుగా పరిగణించే చట్టసభల్లో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడే అవకాశం లేకుండా తీసుకున్న నిర్ణయాలపై మరోసారి ఆలోచించాలని ఆయన సూచించారు.