Thursday, March 28, 2024
HomeTrending NewsLaw & Order: పోలీసు వ్యవస్థను సమీక్షిస్తాం: కేశవ్

Law & Order: పోలీసు వ్యవస్థను సమీక్షిస్తాం: కేశవ్

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైన, భవిష్యత్ ఆశాకిరణంగా ఉన్న యువ నాయకుడు లోకేష్ మీద.. చంపుతామంటూ  ఓ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా మాట్లాడితే కేసు పెట్టాలన్న ఆలోచన పోలీసు యంత్రాంగానికి లేకపోవడం దారుణమని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ప్రతిపక్షానికి చెప్పడానికి, కట్టడి చేయడానికి… అధికార పార్టీ చెప్పిన ఆర్డర్ అమలు చేయడానికి మాత్రమే పని చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు హయంలో పోలీసు యంత్రాంగం సమర్ధవంతంగా పని చేసిందన్నారు.

చంద్రబాబు, లోకేష్ లపై అనంతపురం జిల్లా  రాప్తాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ  జిల్లా ఎస్పీ ఫకీరప్పకు జిల్లా టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడుతూ  సిఎం ఫ్లెక్సీ చినిగిపోతే నలుగురు డిఎస్పీలు, డాగ్ స్క్వాడ్ వెళ్తాయని, మూడు బృందాలు దర్యాప్తు చేస్తాయని, ఈ ప్రభుత్వంపై కడుపు మండిన కార్మికుడో, కర్షకుడో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే బెదిరించి, అర్ధరాత్రి అరెస్టు చేస్తారని… పోలీసు యంత్రాంగం ఈ రకంగా ఉందని విమర్శించారు. పోలీసు వ్యవస్థను డిజిపి నడుపుతున్నారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని, సిఎంవో నేరుగా ఇస్తున్న ఆదేశాలతోనే జిల్లా ఎస్పీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు.

రాజ్యాంగేతర శక్తులు, సలహాదారులుగా నియమితులైనవారు ఎస్పీలకు ఆదేశాలు ఇస్తున్నారని, ప్రత్యక్షంగా ఇవ్వకపోతే ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా ఇప్పించే పరిస్టితులు నెలకొన్నాయని, వీళ్ళందరి కాల్ డాటా బైట పెట్టాలని డిమాండ్ చేశారు.

రాబోయే కాలంలో చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థపై సమీక్ష జరుగుతుందని, ఇప్పడు వారు వ్యవహరించిన తీరుపై కమిషన్లు ఏర్పాటు చేసి విచారిస్తామని, పోలీసు వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుందని పయ్యావుల వెల్లడించారు.

సమాజంలో కక్ష, కార్పణ్యాలతో సమాజం ఉండకూడదని, గతంలో తెలుగుదేశం పార్టీ వారు తప్పు చేసినా చంద్రబాబు చర్యలు తీసుకున్న ఉదంతాలు ఉన్నాయని కేశవ్ గుర్తు చేశారు. జిల్లా ఎస్పీని కలిసిన వారిలో మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, నేతలు బి.పార్థసారధి, ప్రభాకర్ చౌదరి తదితరులు ఉన్నారు.

ఎస్పీతో భేటీకి ముందు జిల్లా పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

Also Read : ఫూలే  స్ఫూర్తితోనే టిడిపి ఆవిర్భావం: బాబు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్