అనుపమను మళ్లీ తెరపై చూడాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే!

ఎలాంటి స్కిన్ షో చేయకుండా కేవలం నటన ప్రధానమైన పాత్రల ద్వారా మాత్రమే కెరియర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్స్ లో అనుపమ పరమమేశ్వరన్ ఒకరుగా కనిపిస్తుంది. తమిళ .. మలయాళ భాషల్లోను ఆమెకి మంచి క్రేజ్ ఉంది. అందువలన ఈ మూడు భాషల్లోను తనకి నచ్చిన ప్రాజెక్టులను ఎంచుకుంటూ ఆమె ముందుకు వెళుతోంది. టీనేజ్ లోనే అనుపమ ఇండస్ట్రీకి వచ్చింది. అందువలన ఇండస్ట్రీలోని కుర్ర హీరోలందరి జోడీగా ఆమె చక్కగా కుదురుతోంది.

తెలుగులో ‘ అ ఆ’ .. ‘శతమానం భవతి’ .. ‘కార్తికేయ 2′ వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. చూడటానికి చిన్నపిల్లగా ఉన్నప్పటికీ, నాయిక ప్రధానమైన కథలను తనపై వేసుకుని నడిపించగల సమర్థత ఆమెకి ఉంది. ’18 పేజెస్’ సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయినప్పటికీ, ఆమె నటనకు పడవలసిన మార్కులు పడ్డాయి. ఇక మళ్లీ ఆమె తెరపై కనిపించాలంటే, ‘టిల్లు స్క్వైర్’ సినిమా రావలసిందే.

ప్రస్తుతం ఆమె తమిళంలో ఒక సినిమా .. మలయాళంలో ఒక సినిమా చేస్తోంది. తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ జోడీగా ‘టిల్లు స్క్వైర్’ చేస్తోంది. గతంలో యూత్ ను మెప్పించిన ‘డీజే టిల్లు’ సినిమాకి ఇది సీక్వెల్. నాగవంశీ .. సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ లోపల అనుపమ తెలుగులో వేరే ప్రాజెక్టులేమైనా ఒప్పుకుంటుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *