కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతుండడంతో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జులై 26నుంచి ఆగస్టు 2వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు తయారు చేస్తోంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేపు చిన వీరభద్రుడు వెల్లడించారు. ఈ విషయంలో గురువారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని వివరించారు.
6.28 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 11 పేపర్ల బదులు 7 పేపర్లకి పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసిన నెల రోజుల్లోగా ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పరీక్షల విధుల్లో దాదాపు 80వేల మంది టీచర్లు, ఇతర సిబ్బంది భాగస్వాములు కావాల్సి ఉంటుందని, వీరందరికీ వ్యాక్సిన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన వారికి కూడా అతి త్వరలో ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసి తీరాలని ప్రభుత్వం భావిస్తోంది.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, కోవిడ్ సోకిన విద్యార్ధులు ఎవరైనా ఉంటే వారు పర్కీక్షలు రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని విద్యా శాఖ చెబుతోంది.