ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించనుంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే పెట్టింది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 31 వరకూ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. ఉచిత ఇసుక పాలసీని కూడా ఆమోదించింది.
మరోవైపు, రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించ నున్నట్లు రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన వెల్లడైంది.