Friday, March 29, 2024
HomeTrending Newsపోలవరంపై సిఎం సమీక్ష

పోలవరంపై సిఎం సమీక్ష

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  అవుకు టన్నెల్ పనులు వేగవంతం చేయాలని, పనుల్లో అలసత్వం వహించొద్దని సూచించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జలవనరులశాఖపై సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఇతర ప్రాజెక్టుల ప్రగతిని కూడా సిఎం అడిగి తెలుసుకున్నారు.

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు సిఎంకు వివరించారు.  దిగువ కాపర్‌ డ్యాం పనులు, కెనాల్స్‌ కు కనెక్టివిటీ తదితర అంశాలపై చర్చ జరిగింది.  ఆర్‌ అండ్‌ ఆర్ ‌పనులపైనా సిఎం సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సిన నిధులు రూ.2033 కోట్లకు పైనే ఉందని అధికారులు తెలియజేశారు.

గ్యాప్‌-3 కాంక్రీట్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేశామని, ఎగువ కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేసి, వచ్చే ఖరీప్‌ నాటికి కాల్వల ద్వారా నీరందించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు వివరించారు. దిగువ కాపర్‌ డ్యామ్‌ పనులను నవంబరు నాటికి పూర్తి చేసి, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) పనులను ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు.

మరోవైపు ఇతర ప్రాజెక్టుల్లో నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తయ్యయని, నవంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమని అధికారులు సిఎంకు చెప్పారు.  అవుకు టన్నెల్‌ నిర్మాణ పనుల్లో గణనీయ ప్రగతి సాధించామని,  ఫాల్ట్‌ జోన్‌లో తవ్వకాలు జరిపి పటిష్టపరిచే కార్యక్రమాలను చురుగ్గా చేపడుతున్నామని, వచ్చే ఆగస్టు నాటికి టన్నెల్‌ పూర్తిచేసి నీటిని ఇవ్వగలుగుతామని వెల్లడించారు.

ఈ సందర్భంగా సిఎం సూచనలు…

⦿ వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ పనుల వేగం పెంచాలి
⦿ నిర్దేశించుకున్న సమయానికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలి
⦿ నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణంకోసం కూడా తగిన చర్యలు తీసుకోవాలి
⦿ ఒడిశా రాష్ట్రంతో చర్చలకోసం తగిన చర్యలు తీసుకోవాలి
⦿ తోటపల్లి బ్యారేజీ పనులపై కూడా దృష్టి పెట్టాలి
⦿ మహేంద్ర తనయ పనులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలి
⦿ గులాబ్‌ తుపానుతో ఎక్కడైనా ఇరిగేషన్‌ కాల్వలు దెబ్బతింటే వాటిని సత్వరం బాగు చేయాలి
⦿ కొల్లేరు వద్ద గోదావరి, కృష్ణాడెల్టాల్లో రెగ్యులేటర్‌ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి
⦿ తాండవ ప్రాజెక్టు విస్తరణ, కృష్ణానదిపై బ్యారేజీల నిర్మాణంపై సిఎం ఆరా, ఇప్పటికే టెండర్లను పిలిచామన్న అధికారులు,

ఈ సమీక్షా సమావేశానికి జలవనరులశాఖ మంత్రి పి అనిల్‌ కుమార్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, జలవనరులశాఖ ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లు, నిర్మాణ సంస్ధల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్