Sunday, February 2, 2025
HomeTrending Newsదిశ చట్టంపై స్మృతి ఇరానీకి జగన్ లేఖ

దిశ చట్టంపై స్మృతి ఇరానీకి జగన్ లేఖ

AP CM Jagan Review On Disha And Abhayam App Writes Letter To Union Minister Smrithi Irani : 

మహిళల భద్రత, రక్షణ కోసం రాష్ట్రం ప్రభుత్వం తయారు చేసిన దిశ చట్టం త్వరగా ఆమోదం పొందేలా సహకరించాలని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము కేంద్రానికి పంపిన బిల్లుకు సంబంధించి కేంద్ర హోం శాఖ కొన్ని అంశాలకు సంబంధించి స్త్రీ శిశు మంత్రిత్వ శాఖను అభిప్రాయం కోరిందని, ఈ విషయంలో వెంటనే స్పందించి అభిప్రాయాన్ని త్వరగా పంపాలని జగన్ కోరారు. ఆ తరువాత రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుందని జగన్ లేఖలో పేర్కొన్నారు. బిల్లులో తాము పొందుపరిచిన అంశాలను వివరించడానికి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిని కూడా పంపుతామని స్మృతి ఇరానీకి జగన్ ప్రతిపాదించారు.

‘దిశ’ కింద తీసుకుంటున్న చర్యలు, అభయం యాప్ పై క్యాంపు కార్యాలయంలో సిఎం వైయస్‌.జగన్‌ సమీక్షించారు. ఇదే సమావేశంలో కేంద్రమంత్రికి లేఖపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ‘దిశ’ కాల్‌సెంటర్లో అదనపు సిబ్బంది ద్వారా ఈ వ్యవస్థ బలోపేతానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దిశ పెట్రోలింగ్‌ కోసం కొత్తగా 145 స్కార్పియోల కొనుగోలుకు సీఎం ఆమోదం తెలిపారు. విద్యాసంస్థలు, యూనివర్శిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలతోపాటు ముఖ్యమైన ప్రాంతాలకు సంబంధించిన పోలీస్‌స్టేషన్లకు ఈ వాహనాలు అందిచాలని ఆదేశించారు.

సమీక్ష సందర్భంగా సిఎం పలు సూచనలు చేశారు…

  • గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను యాక్టివ్‌గా చేయాలి
  • ఫిర్యాదు చేయడానికి, కేసు పెట్టడానికి మహిళలు ఎవ్వరూ కూడా పోలీస్‌స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలి
  • గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకే ఫిర్యాదు చేసేలా చూడాలి
  • జీరో ఎఫ్‌ఐఆర్‌ అవకాశాన్ని విస్తృతంగా కల్పించాలి
  • బాధిత మహిళ ఒక గ్రామం నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడానికి సంకోచించవచ్చు, అలాంటి మహిళలు గ్రామాల్లో ఉన్న మహిళా పోలీసుల ద్వారానే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించాలి
  • దిశయాప్‌ల్లో ఉన్న అన్ని ఫీచర్లపైనా మహిళా పోలీసులకు పూర్తిస్థాయి అవగాహన, శిక్షణ కల్పించాలి
  • మహిళలపై నేరాలకు సంబంధించిన 18 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాం. మరోసారి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దీనికి సంబంధించి మాట్లాడాలి
  • అలాగే బాలలపై నేరాలకు సంబంధించి 19 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలి
  • వారాంతంలోగా ఇప్పటికే ఉన్న డిజిగ్నేటెడ్‌ కోర్టుల్లో పూర్తిస్థాయి రెగ్యులర్‌ పీపీల నియామకం పూర్తిచేయాలి

ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుమార్‌ విశ్వజిత్, ఆర్దికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, మహిళా, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కే.వి.రాజేంద్రనాథ్‌ రెడ్డి, దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : మహిళలకు అస్త్రం దిశ యాప్: జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్