మహిళలకు అస్త్రం దిశ యాప్: జగన్

ప్రతి మహిళకు దిశ యాప్‌ అవసరమని, దిశ యాప్‌పై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం పేర్కొన్నారు. మంగళవారం నాడు విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామంలో జరిగిన ‘దిశ’ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్‌ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరించారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన కలిచివేసిందని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని గుర్తుచేశారు. 17 లక్షల మంది దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్‌ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్‌ చెప్పారు. ఫోన్‌లో దిశ యాప్‌ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు.

పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులని, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టం కూడా చేశామని సీఎం వైఎస్ జగన్‌ తెలిపారు. దిశ కేసుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టామని, దిశ కేసుల విచారణ కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *