సీతానగరం పుష్కర ఘాట్ సంఘటనలో నిందితులను కతినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు పోలీసు బృందాలు రంగలోకి దిగాయని, అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రులు సుచరిత, తావేటి అనిత పరామర్శించారు. డాక్టర్లను అడిగి యువతి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, బాధితురాలి కుంటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సిఎం జగన్ 5 లక్ష రూపాయల సాయం ప్రకటించారని సుచరిత వివరించారు.
నిందితులను వదిలిపెట్టం : డీజీపి
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో యువతి పై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకరమని ఏపి డిజిపి గౌతమ్ సావాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఇటువంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, నేరానికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితిలో వదిలి పెట్టబోమని డిజిపి హెచ్చరించారు. మహిళల భద్రత మా శాఖ ప్రథమ కర్తవ్యమని, ఎన్నో చర్యలు చేపట్టినా, ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని డీజీపీ వ్యాఖ్యానించారు. ప్రతి మహిళ దిశ యాప్ ను ఖచ్చితంగా వాడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు