గుంటూరు బి. టెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఈ సంఘటన దురదృష్టకరమని అయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించామని, కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని డిజిపి వెల్లడించారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, చట్టం ద్వారా నిందితుడికి కఠినంగా శిక్షిపడేలా చూస్తామన్నారు.
సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని డిజిపి సూచించారు. యువతులు, మహిళలపై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవని అయన హెచ్చరించారు. జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడవద్దని అయన విజ్ఞప్తి చేశారు. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఘటన జరిగిన తక్షణం వేగంగా స్పందించి కేసు ను ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులకు అభినందనలు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి సత్వరం కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు ఇచ్చామని డిజిపి వివరించారు.
గుంటూరులో యువతి హత్యా ఘటనపై సీఎం ఆరా
గుంటూరులో యువతి రమ్య హత్య ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘దిశ’ కింద వేగంగా చర్యలను తీసుకుని దోషికి కఠినశిక్ష పడేలా చేయాలన్నారు. ఘటన వివరాలు తెలియగానే హోంమంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని., పరిహారంగా రూ.10లక్షలు ఆకుటుంబానికి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.