Thursday, April 25, 2024
Homeసినిమాఆసక్తిని రేకెత్తించిన 'చతుర్ ముఖం'

ఆసక్తిని రేకెత్తించిన ‘చతుర్ ముఖం’

(ఆహా రిలీజ్)

Chathur Mukham :

ఈ మధ్య కాలంలో మలయాళంలోని సినిమాలు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. అలాగే తెలుగు ఓటీటీ ఫ్లాట్  ఫామ్ మీద కూడా మలయాళ అనువాదాలు జోరు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా ఈ ఏడాది ఆరంభంలో మలయాళంలో వచ్చిన ‘చతుర్ ముఖం‘ .. తెలుగు ఓటీటీ ‘ఆహ’లో ఆగస్ట్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. జిన్ టామ్ .. జస్టిన్ థామస్ నిర్మించిన ఈ సినిమాకి, రంజిత్ కమలా శంకర్ – సలీల్ .వి దర్శకత్వం వహించారు. ప్రధానమైన పాత్రను పోషించిన మంజువారియర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

తేజస్విని (మంజు వారియర్) ఒక మధ్యతరగతి యువతి. పల్లెటూళ్లో పుట్టిపెరిగిన ఆమె, ఉన్నత విద్యను పూర్తి చేసి, పట్నంలో తన కాళ్లపై తాను నిలబడాలని అనుకుంటూ ఉంటుంది. ఆధునిక భావాలు .. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. దెయ్యాలు .. ఆవహించాడాలు వంటి మూఢ నమ్మకాలకు ఆమె చాలా దూరం. బ్యాంకులో లోన్ తీసుకుని తన స్నేహితుడితో కలిసి ఆమె ఒక బిజినెస్ ను మొదలుపెడుతుంది. ఈ విషయంలో తన స్నేహితుడైన ఆంటోని సహాయం తీసుకుంటుంది. అందుకు సంబంధించిన పనులు చురుకుగా జరుగుతూ ఉంటాయి.

అలాంటి పరిస్థితుల్లోనే ఆమె స్మార్టు ఫోన్ పాడైపోవడంతో, కాస్త తక్కువ రేట్లో మరో ఫోన్ తీసుకోవాలనుకుంటుంది. అలా  మొత్తానికి ఒక స్మార్టు ఫోన్ బుక్ చేసి తెప్పించుకుంటుంది. ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఆమె జీవితంలో చిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ఫోన్ లో నుంచి తన సిమ్ తీసేసినా అది రింగ్ అవుతూ ఉంటుంది. దాంతో ఆమె ఆ ఫోన్ ను ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటుంది. అయితే ఏం చేసిన ఎలాగో అలా ఆ ఫోన్ తిరిగి ఆమె దగ్గరికే చేరుతుంటుంది.

Chathur Mukham Movie Review :

అయితే ఆ ఫోన్ తన దగ్గర లేకపోతే స్కిన్ ఎలర్జీ రావడం .. ఆ ఫోన్ పట్టుకోగానే స్కిన్ ఎలర్జీ వెంటనే తగ్గిపోవడం ఆమె గమనిస్తుంది. దాంతో అలాంటి ఫోన్ ఎవరు వాడుతున్నారో తెలుసుకుని, వాళ్లని కలుసుకోవాలనుకుంటుంది. అలా ఆమె ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లేసరికి అతను చనిపోతాడు. అలాంటి ఫోన్ వాడుతున్న మరో వ్యక్తి విషయంలోనూ అలాగే జరుగుతుంది. చనిపోవడానికి ముందు ఆ ఫోన్లలో వాళ్లు తీసుకున్న సెల్ఫీలను బట్టి ఆమెకి ఒక విషయం అర్థమవుతుంది. దానిని బట్టి తాను కూడా సెల్ఫీ తీసుకోవడంతో, తాను చనిపోవడానికి కూడా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉందనే విషయం ఆమెకు అర్థమవుతుంది.

అప్పుడు తేజస్విని ఏం చేస్తుంది? ఆ ఫోన్లకు .. అవి కొన్నవారి మరణాలకు సంబంధం ఏమిటి? ఈ విషయాన్ని ఆమె ఎలా కనిపెడుతుంది? ముంగిట్లో నిలబడిన మృత్యువును ఆమె ఎలా ఎదుర్కుంది? అనేదే అసలైన కథ. ఈ సినిమాలో ఎలాంటి ఆటపాటలు .. సరదా సన్నివేశాలు ఉండవు. చిక్కుముడిలాంటి ఒక సమస్య .. ఆ ముడులను విప్పుకుంటూ పోయే ఒక యువతి .. ఇదే కథ. అయినా ఎక్కడ బోర్ కొట్టే అంశాలు కనిపించవు. కథ .. స్క్రీన్ ప్లే .. రీ రికార్డింగ్ .. కెమెరా పనితనం అనే నాలుగు పిల్లర్లపై ఈ సినిమా బలంగా నిలబడింది.

టెక్నో హారర్ సినిమా అనేసరికి సాధారణమైన ప్రేక్షకులకు ఇది అర్థమవుతుందా? అనే సందేహం కలగడం సహజం. కానీ కాస్త పాత్రలతో వివరంగా చెప్పించిన తీరు వలన తేలికగానే అర్థమైపోతుంది. తెరపై తక్కువ పాత్రలు .. తక్కువ బడ్జెట్ కనిపించినా, కథ నడుస్తున్న విధానాన్ని కళ్లప్పగించి చూడవలసిందే. అంత పట్టుగా .. పర్ఫెక్ట్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక్కో అంశాన్ని రివీల్ చేసుకుంటూ వెళుతున్నప్పుడు ఏ అంశం ఎక్కడా తేలిపోదు. అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతూ వెలుతుందేగాని, కథలో నుంచి ప్రేక్షకులు బయటికి రారు. చివరికి క్లైమాక్స్ కూడా ఒక మెట్టు దిగలేదు .. ఒక ఇంచు తగ్గలేదు.

మంజువారియర్ ఈ పాత్రలో జీవించింది. నిజంగా ఆమె కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్ర. అందమైన జీవితం అతలాకుతలం అవుతున్నప్పుడు, ఆ విషయన్ని తనవాళ్లతో చెప్పుకోలేక .. తన మనసులోనే దాచుకోలేక . ఒంటరిగా ఫేస్ చేయలేక ఉద్వేగానికి లోనయ్యే ఈ పాత్రకు ఆమె ప్రాణం పోసింది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : అప్పుడు మేకకొక తోక – ఇప్పుడు తోకకొక మేక

RELATED ARTICLES

Most Popular

న్యూస్