AP Education Minister Audimulapu Suresh Conducted Review On AP Salt Programme :
రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ‘అభ్యసన పరివర్తన సహాయక పథకం’ (SALT) అనే సరికొత్త పథకానికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో శ్రీకారం చుట్టామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు (IBRD) 250 మిలియన్ అమెరికన్ డాలర్ల (1,860 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయం అందిస్తుందని విద్యాశాఖామాత్యులు అన్నారు. దీనితో రాబోయే ఐదేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతాయని ఆయన అన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సురేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఈ పథకం ద్వారా ఫౌండేషన్ లెర్నింగ్ ను బలోపేతం చేయడం; ఉపాధ్యాయ-విద్యార్థుల పరస్పర సంబంధాలను, బోధనా నాణ్యతను మెరుగుపరచడం; సంస్థాగత సామర్థ్యాలను, సామాజిక సంస్థల ప్రమేయాన్ని బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన సేవలను అందించడం వంటి ముఖ్యమైన మూడు కీలక అంశాలపై దృష్టి సారించి, రాష్ట్రంలో అభ్యసనాభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
ఇది ప్రపంచ బ్యాంకు ప్రత్యేక ప్రాజెక్టు అని, మన రాష్ర్టంలో గత పదేళ్లలో ఇలాంటి ప్రాజెక్టు అమలు జరగలేదని మంత్రి పేర్కొన్నారు. ఫలితాలే లక్ష్యంగా అమలయ్యే ఈ ప్రాజెక్టును నిర్వహణ సామర్థ్యం కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ప్రపంచ బ్యాంకు ఇస్తుందని మంత్రి అన్నారు. ఇలాంటి ప్రాజెక్టు మన రాష్ట్రానికి రావడం గర్వకారణం అని కొనియాడారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఈ పథకం అమలు జరుగుతుందన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సలహా సంస్థల నుంచి కన్సల్టెంట్లను ఎంపిక చేయనున్నామన్నారు.
రాష్ట్రంలో ఈ పధకం పర్యవేక్షణ కోసం ఒక ఐ ఏ ఎస్ అధికారి, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తామని మంత్రి తెలిపారు. కడప జిల్లాలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకోసం ఏర్పాటయిన వై ఎస్ ఆర్ విజేత స్కూల్ తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసెందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సాల్ట్ పథకం ద్వారా మన రాష్ట్రం విద్యా పరంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు సాధించేందుకు వీలు కలుగుతుందని మంత్రి సురేష్ అన్నారు.
Must Read : డిగ్రీ, పిజీ విద్యార్థులకు వ్యాక్సిన్ : మంత్రి సబితా