మాన్సాస్ ట్రస్టు విషయంలో సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రస్టు నిర్వహణ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ట్రస్ట్ మాజీ చైర్మన్ అశోక్ గజపతి రాజు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను విచారించిన హైకోర్టు నేడు ఉత్తర్వులు వెలువరించింది.
మాన్సాస్ ట్రస్టు చైర్మన్ తో పాటు మహాలక్ష్మి దేవస్థానం, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ దేవస్థానానికి గతంలో కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు వ్యవహరించేవారు. అయన స్థానంలో అశోక్ గజపతి సోదరుడు ఆనంద గజపతి కుమార్తె సంచయితను నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 72 జీవోను విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు.
సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన ధర్మాసనం వెంటనే అశోక్ గజపతిరాజుని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో అశోక్ గజపతి రాజుని నియమిస్తూ ఇచ్చిన జిఓలు వెంటనే అమల్లోకి వస్తాయని తీర్పులో పేర్కొంది.