ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నేడు ఢిల్లీ వెళ్ళిన రజని నిర్మాణ్ భవన్ లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయను కలుసుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పలు విషయాలను ఆయనతో చర్చించారు.
పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల లో మెడికల్ కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని, ఇక్కడ ర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. గతంలో ఏపీలో 13 జిల్లాలు ఉండేవని, జనాభా పెరిగిన నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడు 26 జిల్లాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పటికే అన్ని చోట్లా మెడికల్ కళాశాలల నిర్మాణం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు.
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో కీలకమైన మార్పులు తీసుకొస్తున్నామని రజని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్తూ… కేంద్ర ప్రభుత్వ చేయూత కూడా తోడైతే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని త్వరలో రాష్ట్రంలో అమలు చేయబోతున్నామని చెప్పారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల గురించి కేంద్రమంత్రికి వివరించారు.
కాగా, ఏపీలో చేపట్టిన నూతన మెడికల్ కళాశాల నిర్మాణానికి అన్ని విధాలా సాయం చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. 10 లక్షలు జనాభా దాటిన ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించుకునే అవకాశం ఉందని, ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మిస్తుండటం అభినందనీయమని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేయాలో.. అవన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో గ్రామ సచివాలయాన్ని తాను స్వయంగా సందర్శించానని, ఒక్కో విభాగానికి ఒక్కో కార్యదర్శి ఉండటం చాలా గొప్ప విషయమని కేంద్రమంత్రి ప్రశంసించారు.
మంత్రి రజని వెంట రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ కూడా కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.