Victory of Farmers: అమరావతి రైతుల ఉద్యమం స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అభివర్ణించారు. అమరావతి, సీఆర్డీఏపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు ఇచ్చిన తీర్పును చంద్రబాబు స్వాగతించారు. 807 రోజులుగా మహిళలు, రైతులు దీక్షలు, ఆందోళనలు చేస్తున్నారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వారు వెనక్కి తగ్గలేదని కొనియాడారు. ఈ విజయం ప్రజా రాజధానిదని, ఐదు కోట్ల ఆంధ్రులదని, ఈ పోరాటంలో విజయం సాధించిన అమరావతి రైతులకు బాబు అభినందనలు తెలియజేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువయ్యిందన్నారు. తనకు కులాలంటే తెలియదని, తన కులం ప్రజా కులం అని బాబు వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమామే తన లక్ష్యమన్నారు.
అమరావతిని స్మశానం అన్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలు, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకుంటే దానిపై కులం ముద్ర వేశారని విస్మయం వ్యక్తం చేశారు. మొదట్లో అమరావతి రాజధానిపై అభ్యంతరం లేదన్న జగన్ తర్వాత ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడు ముక్కలాట ఆడతారా అని నిలదీశారు. జగన్ ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు… ఎక్కడికీ వెళ్ళబోరని ఎన్నికలకు ముందు చెప్పిన వైసీపీ నేతలు తర్వాత అమరావతిపై విషపూరిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి అనేది ఏపీకి ఆదాయం సృష్టించే వనరు అని, అమరావతి అభివృద్ధి చెంది ఉంటే విద్యార్ధులు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
Also Read : సిఆర్డీయే రద్దు చెల్లదు: హైకోర్టు ఆదేశం