ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రోజు అది అల్పపీడనంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ఈ అల్పపీడనం మూడు రోజులపాటు నెమ్మదిగా కదులుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 29, 30 తేదీల్లో ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
సాధారణంగా జనవరి మొదటి వారం తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడవు. అయితే, ప్రస్తుతం సముద్రంపై తేమ అధికంగా ఉండటంతో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడటానికి కారణం అవుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, ఏపీలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి.