Friday, November 22, 2024
Homeజాతీయంఏదీ రహస్యం కాదు

ఏదీ రహస్యం కాదు

“మనసులోని మర్మమును దెలుసుకో;
మానరక్షక! మరకతాంగ!
ఇనకులాప్త నీవే గాని వేరెవరు లేరయా; ఆనంద హృదయ!
మునుపు ప్రేమ గల దొరవై, సదా
చనువు నేలినది గొప్పగాదయా;
కనికరంబుతో నీవేళ నా
కరము బట్టు, త్యాగరాజ వినుత!”

“కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకడయిన మన త్యాగరాజు తమిళగడ్డమీద కావేరీ తీరంలో దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం రాసి, పాడి ప్రపంచానికి కానుకగా ఇచ్చిన కీర్తన ఇది. తన మనసులో మాటను తెలుసుకో! అని నేరుగా అయోధ్య రాముడినే అడిగాడు. అప్పట్లో సెల్ ఫోన్లు, వాట్సాప్ లు, టెలిగ్రామ్, సిగ్నల్ వీడియో కాల్స్ లేవు. ఏదున్నా ముఖా ముఖి తేల్చుకోవాల్సిందే. 96 కోట్ల రామనామం జపం చేసినా రాముడు కనికరించకపోయే సరికి త్యాగయ్య రాముడిమీద అలిగి బుంగ మూతి పెట్టుకుని పాడిన కీర్తన ఇది. ఎవరినెవరినో రక్షించావు; ప్రాణాలు, మానాలు కాపాడావు; అప్పుడెప్పుడో నాతో చనువుగా ఉన్నది కాదు; నేను పిలిచినప్పుడు…ఇప్పుడు…అర్జంటుగా వచ్చి నా చేయి పట్టుకుని…నన్ను పునీతుడ్ని చేయి; నా మనసులో ఏముందో కనీసం తెలుసుకోలేవా స్వామీ!”

అంటే- కరుణాసముద్రుడయిన రాముడు కరిగిపోయి త్యాగయ్య మనసులోకి దూరి, ఆయన మనసులో ఉన్నది చదివి, ఆయన అడిగినట్లే చేయి పట్టుకుని ఆయన్ను పునీతుడ్ని చేశాడు.

ఆ సమయానికి సాకేత రాముడి దగ్గర ఇజ్రాయిల్ స్పై వేర్ పెగాసస్ లేదు. భక్తుల మనసుల్లోకి, మెదళ్లలోకి దూరి వారి మనసు, మెదళ్లను చదవడం అవతార పురుషుడికయినా చాలా కష్టంగా ఉండేది.

రాముడు ఎప్పటివాడో మన అంచనాకు అందదు. త్రేతాయుగంలో ఆయనకు వసిష్ఠుడు పేరు పెట్టినా ఆ పేరు అంతకు ఎంతో ముందే వేదాల్లో ఉంది. దాంతో రాముడిదంతా ఓల్డ్ మోడల్లా ఉంటుంది.

అదే రామ భక్త ప్రభువులు ఇప్పుడు లేటెస్ట్ రహస్య టెక్నాలజీని ఇజ్రాయిల్ నుండి కొని ప్రత్యర్థులు, శత్రువుల కదలికలను, మాటలను, వారి వ్యక్తిగత డేటాను ఎప్పటికప్పుడు రికార్డు చేసుకుంటున్నారు. ఈ పేరుగొప్ప స్పై సాఫ్ట్ వేర్ కు, కొంత హార్డ్ వేర్ కూడా ఉంటుంది. సగటున యాభై ఫోన్లు ఏడాది పాటు రికార్డు చేయడానికి 58 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 58 కాకపొతే, 580, అదీ కుదరకపోతే 5,800 కోట్లయినా ఖర్చు పెడతారు. ప్రత్యర్థుల సమాచారం అంత విలువయినది. డబ్బుదేముంది? ప్రభుత్వ ఖజానాలో ఏదో ఒక లెక్క చూపని ఖాతా నుండి వాడేయవచ్చు.

రాజకీయాల్లో మనమేమి చేస్తున్నామన్నదానికంటే- ప్రత్యర్థి ఏమి చేస్తున్నాడో తెలుసుకోవడమే ముఖ్యం. పెగాసస్ పేరు కొత్తది కావచ్చు, లేటెస్ట్ వర్షన్ కావచ్చు, ఇంకొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండి ఉండవచ్చు కానీ- ఈ పనులు కొత్తవి కావు. ఫోన్ ట్యాపింగులకే కూలిన ప్రభుత్వాలను చూశాం. అయినా ట్యాపింగులు ఆగవు.

తాజాగా ఎవరెవరి ఫోన్లను కేంద్ర ప్రభుత్వం ఎంత కాలం రహస్యంగా రికార్డు చేసిందో వివరిస్తూ అంతర్జాతీయ మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలొస్తున్నాయి. మిలటరీ, పోలీసులు ఇలాంటి రహస్య టెక్నాలజీలను కొని ఉపయోగిస్తుంటారు. మిలటరీ, పోలీసు ప్రభుత్వ వ్యవస్థలో భాగం.

గోడమీద తుపాకి ఉందని కథలో చెబితే…కథ అయిపోయే లోపు ఆ తుపాకీని వాడి తీరాలని కథా శిల్పశాస్త్రంలో ప్రఖ్యాత కథా రచయిత మధురాంతకం రాజారామ్ సిద్ధాంతీకరించారు. అలా ఫోన్లను రహస్యంగా రికార్డు చేసే సాఫ్ట్ వేర్ ఉన్న తరువాత అది వాడి తీరాలి. దేశం బయట ఉగ్రవాదులు ఎలాగూ ఇలాంటి సాఫ్ట్ వేర్ ల కంటికి చిక్కకుండా మాట్లాడుతుంటారు కాబట్టి…దీని పరిధిలోకి చిక్కుకోదగ్గ దేశంలోపలి వారినే ఎంపిక చేసుకుని వారి ఫోన్లను రికార్డు చేయడం ఏరకంగా చూసినా ఉత్తమ ధర్మం! కనీస కర్తవ్యం!

ఇన్నాళ్లు గోడలకే చెవులు ఉండేవి. ఇప్పుడు పెగాసస్ ఒళ్లంతా కళ్లే. ఒళ్లంతా చెవులే.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్