Sunday, April 13, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహనుమజ్జయంతి ప్రత్యేకం

హనుమజ్జయంతి ప్రత్యేకం

“మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి”

ఈ శ్లోకం చెవిని పడగానే ఏ ఆలోచనాపరుడిచేతనైనా ఆలోచింప చేసేది ‘శ్రీరామదూతం శిరసానమామి’ అనే చివరి పాదం.

ప్రపంచంలో ప్రభువుకు ప్రశస్తి రావటం సులభం. ఎందుకంటే ఆయనది ఉన్నత స్థానం. ఆ ప్రభువు గుణవంతుడు, ప్రజాహిత పాలకుడు అయితే, ఆయనకు కేవలం గొప్ప పేరు మాత్రమే కాదు, విశేషించి పూజ్యత కూడ లభిస్తుంది. కాని, ఆ ప్రభువు దగ్గర ఒక సేవకుడుగా ఉండే వ్యక్తికి, ప్రభువుతో సమానంగా ప్రశస్తి రావటము, పూజ్యత లభించటము అసంభవం కాకపోయినా, అసాధారణం అని మాత్రం అనక తప్పదు. ఆ సేవకుడికి ప్రభువుతో సమానంగా ప్రశస్తి, పూజ్యత లభించాలంటే ఆయన వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనదై ఉండాలి.

శ్రీమద్రామాయణంలో సుగణాభిరాముడు, ధర్మ స్వరూపుడు, శక్తి సంపన్నుడు, ప్రజాహిత పాలకుడు అయిన శ్రీరామచంద్రుని వంటి మహా ప్రభువుకు సేవకుడై, ఆయనతో పాటు తానూ ఆలయాలు నిర్మింప చేసుకొంటూ, ఆయనతో పాటు తానూ అర్చనలందుకొంటూ, శ్రీరామ దూతం శిరసా నమామి’ అనే స్తోత్రానికి పాత్రుడైన మహా వ్యక్తి ఆంజనేయుడు.

అంతేకాదు. విశ్వ చరిత్రలో ఆలాంటి సేవకుడు ఒక్క ఆంజనేయుడే అని అనిపిస్తుంది. ఒకింత సాహసమే అయినా, ఒక మాట ముందుకు మిగిలి అంటే, మన దేశంలో రామాలయాల కంటె ఆంజనేయస్వామి ఆలయాలే అధికంగా ఉన్నాయేమొ! రామ భక్తుల కంటే ఆంజనేయ భక్తులే అధికంగా ఉన్నారేమొ!

ఇంత ప్రశస్తి, ఇంత పూజ్యత ఈ రామదూతకు ఎలా లభించాయి?
అందుకు కారణం ఆయన వ్యక్తిత్వం; శక్తి, యుక్తి, భక్తి త్రివేణీ తీర్థంలా సంగమించిన ఆయన వ్యక్తిత్వం; మహనీయ వ్యక్తిత్వం. ఆలాంటి వ్యక్తిత్వంతో ధర్మ స్వరూపుడైన శ్రీరామచంద్రునికి చేసిన సేవ- నిస్వార్థ సేవ; శ్రీరామదూతగా శ్రీ ఆంజనేయుడు సాధించిన ఘన విజయాలు; వాటి వల్ల ఆనాటి సమాజానికి కలిగిన మేలు. ఇవన్నీ ఆంజనేయునికి అంత ప్రశస్తిని, అంత పూజ్యతను ఆర్జించి పెట్టాయి.

శ్రీమద్రామాయణం – ఆంతరంగా బ్రహ్మస్వరూపుడు, బాహ్యంగా ధర్మ స్వరూపుడు అయిన శ్రీరామచంద్రుని చరిత్ర; అయోధ్య, కిష్కింధ, లంక మూడు రాజ్యాల కథ; నరులు, వానరులు, రాక్షసులు మూడు జాతుల కథ: – సత్త్వరజస్తమస్సులు – మూడు గుణాల కథ.

అలాంటి రామాయణాన్ని ఆమూలాగ్రం చదివిన తరువాత, మన మనస్సులో నిలిచే ప్రధాన వ్యక్తులు నలుగురు శ్రీరాముడు, సీతాదేవి, రావణుడు, శ్రీఆంజనేయుడు. సీతారాములు మనకు ఎంత పూజ్యులైనా, వారిని విమర్శనాత్మకంగా కొన్ని ప్రశ్నలు అడగాలని అనిపిస్తుంది. వాలివధ, సీతా పరిత్యాగం, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండి సీతాదేవి కుశలవులను ప్రసవించినా, ఆ విషయాన్ని ఆ మహర్షి చెపుతూ ఉన్నా, అంతటి అశ్వమేధయాగ మహాసభలో, అందులో ఆమె కొడుకులు కూడా ఉన్న మహాసభలో, ఆ మహాసాధ్విని పాతివ్రత్యం నిరూపించుకొమ్మని పట్టుపట్టటం – ఇదంతా ఏమిటి స్వామీ? అని శ్రీరామచంద్రుణ్ణి అడగాలనిపిస్తుంది. అలాగే సీతామహాదేవి లక్ష్మణుని అన్నమాటలు వింటే ఏమిటమ్మా మరదిని అలా మాట్లాడావు? అని ఆక్షేపించాలనిపిస్తుంది. ఇక రావణుని విషయంలో చెప్పనే అక్కరలేదు. ఎందుకు ఇలా చేశావని ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు. మనం అడగటం కాదు, మండోదరీ దేవే ఆయనను అనేక ప్రశ్నలడిగింది. ఎందుకు ఇలా చేశావని ఎన్నో సార్లు విమర్శించింది.

కాని, అంత రామాయణంలో ఆక్షేపాత్మకంగా ఆంజనేయుణ్ణి అడగటానికి ఏ ప్రశ్నాలేదు. అనటానికి ఏ మాట రాదు. ఆంజనేయుని వ్యక్తిత్వం అంత విశిష్టం!

శ్రీమద్రామాయణంలో ఆంజనేయుని శక్తి సామర్థ్యాలు, యుక్తి విశేషాలు, ఉక్తి నైపుణ్యాలు, భక్తి తాత్పర్యాలు వ్యక్తమయ్యేది – కిష్కింధా సుందర యుద్ధ కాండల్లో. విశేషించి సుందర కాండ మొత్తం ఆయన వ్యక్తిత్వ వైభవమే.

ఆంజనేయుని జీవితంలో అగుపించే ముఖ్య భాగాలు రెండు. ఒకటి, ఆయన రామదూత కావటానికి ముందరి జీవితం. మరొకటి, ఆయన రామదూత అయిన తరువాతి జీవితం. ఆ మహనీయుని వ్యక్తిత్వం ఏ విధంగా శక్తి సామర్థ్య సంపన్నంగా వికాసాన్ని పొందిందో ఆయన జీవితంలోని తొలి విభాగం తెలియచేస్తే, ఆయన వ్యక్తిత్వం ఎంత భక్తి భావ భరితంగా శోభిల్లిందో, ఆయన శక్తి యుక్తులు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు, సమాజ శ్రేయస్సుకు ఎంతగా ఉపయోగ పడ్డాయో ఆయన జీవితంలోని మలి భాగం వ్యక్తం చేస్తుంది.

ఆంజనేయుని అసదృశ రామభక్తి
శ్రీరామచంద్రుని పట్టాభిషేక సమయంలోనే శ్రీ ఆంజనేయుని అసదృశ రామభక్తికి అద్దం పట్టే సంఘటన ఇది. శ్రీరామచంద్రుని సూచన మేరకు సీతమ్మ కూడా తన మెడలోని ముత్యాలహారాన్ని తీసి హనుమ కిచ్చింది. అలంకరించుకొమ్మని కోరింది. కాని హనుమ ఆ హారంలోని ఒక్కొక్క ముత్యాన్ని ఊడబెరికి, పగుల గొట్టి, చెవిదగ్గర పెట్టుకొని ఆవల పారవేయటం ప్రారంభించాడు. అది చూచి అందరు ఆశ్చర్యపోయారు. విభీషణుడు ‘హనుమా! ఏమిటి ఈ కోతి చేష్ట ‘ అన్నాడు. అందుకు హనుమ, ‘విభీషణా! లోకంలో సీతారాముల రూపం కన్పించని, సీత రాముల నామం వినిపించని ఏ వస్తువైనా, అది ఎంత విలువైనదైనా నాకు ఇష్టం ఉండదు’ అన్నాడు. అందుకు విభీషణుడు ‘హనుమా! నీకు ఇంత దేహం ఉన్నది కదా – ఇందులో సీతారాములున్నారా? సీతారాముల నామం వినిపిస్తూ ఉందా? ‘ అనేసరికి, వెంటనే హనుమ తన వక్షాన్ని గోళ్ళతో చీల్చి, తన హృదయంలో కొలువై ఉన్న సీతారాములను చూపాడు. అంతేకాదు. హనుమ రోమ రోమాన రామ నామం విభీషణుడికి వినిపించింది. విభీషణుడు ఆశ్చర్యంతో అవశుడయ్యాడు. హనుమ భక్తికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆశ్చర్యచకితుడై హనుమను మళ్ళీ కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలింతకు రెండుగా చీలి ఉన్న ఆ రామభక్తుని వక్షం మళ్ళీ ఒకటిగా అయిందట. ఆ శ్రీరామచంద్రుని కౌగిలింతలో హనుమ పొందిన ఆనందానికి అవధి లేదట.

ఆప్యాయంగా కౌగిలించుకొని శ్రీరామచంద్రుడు హనుమకు అంత ఆనందాన్ని ఇస్తే, గొప్పగా విందు భోజనం పెట్టి సీతమ్మ హనుమను సంతృప్తి పరచాలనుకొన్నది.

షడ్రసోపేతమైన వంటను సమృద్ధిగా చేయించింది, హనుమకు స్వయంగా వడ్డించింది. కాని, ఎంత తిన్నా హనుమ సంతృప్తి చెందలేదు. సీతమ్మ ఆశ్చర్యపోయింది. అంతా అయిపోయిందని చెప్పవలసి వస్తుందేమో అని చింతించింది.

అంతలోనే లక్ష్మణస్వామి అక్కడికి వచ్చాడు. సీతమ్మ స్థితిని చూచాడు. ‘ అమ్మా! ఒక్క తులసి దళం తెచ్చి, దాని మీద శ్రీరామ అని వ్రాసి, హనుమకు వడ్డించు. ఇక చింతించవలసిన అవసరం ఉండదు’ అన్నాడు. ఆమె ఆలాగే చేసింది. హనుమ ఆ తులసి దళం ఆరగించి ‘అమ్మా! నా కడుపు నిండింది. ఇంకేమీ వద్దు’ అని తృప్తిగా త్రేన్చాడు.  హనుమ రామభక్తి ఆలాంటిది!

అంతేకాదు. తులసి అన్నా, తులసిమాల అన్నా హనుమకు అమితమైన ప్రీతి. హనుమ అంత గొప్ప రామభక్తుడైనా, ఆయన శ్రీరాముని వెంట సరయూ ప్రవేశం చెయ్యలేదు. శ్రీరాముని సరయూ ప్రవేశ సమయంలో అందరు ఆయన వెంట వెళ్ళటానికి సిద్ధమై చేతులు జోడించి నిలబడ్డారు. శ్రీరామచంద్రుడు విభీషణుణ్ణి సరయూ ప్రవేశం చేయవద్దన్నాడు. ‘లంకను ధర్మబద్ధంగా పరిపాలించు’ అన్నాడు.తరువాత రాముడు హనుమ దగ్గరికి వచ్చాడు. ‘హనుమా! నీకు జీవించాలని ఉంది. నా కథ లోకాలన్నింటిలో ఎంత కాలం ప్రచారంలో ఉంటుందో, అంతకాలం అది విని ఆనందిస్తూ, నా ఆజ్ఞలు పాలిస్తూ ఉండు’ అన్నాడు.

“జీవితే కృత బుద్ధిస్త్వం | మా ప్రతిజ్ఞాం వృథా కృథాః
మత్కథాః ప్రచరిష్యంతి | యావల్లోకే హరీశ్వర
తావ ద్రమస్వ సుప్రీతో | మద్వాక్య మనుపాలయన్”

అందుకు హనుమ, స్వామీ!

“ యావత్తవ కథా లోకేషు విచరిష్యతి
తావత్ స్థాస్యామి మేదిన్యాం
తవాజ్ఞా మను పాలయన్ ”
మీ కథ లోకాల్లో ఎంత కాలం ప్రచారంలో ఉంటుందో, అంతకాలం ఈ నేల మీద మీ ఆజ్ఞను పాటిస్తూ ఉంటా’నన్నాడు.  అందుకే హనుమ చిరంజీవి.

తాత్వికుల దృష్టిలో హనుమ
తత్త్వవేత్తలు హనుమను శబ్ద స్వరూపుడంటారు. మంత్ర స్వరూపుడంటారు. పరమాత్మ సందేశాన్ని జీవత్మాకు అందించే ఆచార్య పురుషుడంటారు. దేవదూత అంటారు. రావణుడు కామక్రోధలోభాదులతో కూడుకొన్న మనస్సు అని, అతని పది తలలు పది ఇంద్రియాలని, లంక శరీరమని, దాని చుట్టూ ఉన్న సముద్రమే సంసారమని, శ్రీరాముడు పరమాత్మ అని, లంకలో బంధింపబడిన సీతాదేవి జీవాత్మ అని, ఆజన్మ బ్రహ్మచారి అయిన శ్రీ ఆంజనేయుడు సంసార సాగరాన్ని స్పృశించకుండా ఆకాశ మార్గంలో – అంటే విష్ణు పద మార్గంలో పయనించి, పరమాత్మ అయిన శ్రీరామచంద్రుని సందేశాన్ని జీవాత్మ అయిన సీతాదేవికి అందించి, జీవాత్మ అయిన ఆ సీతాదేవి వేదనను పరమాత్మ అయిన శ్రీరామచంద్రునికి చేరవేసి సంసార రూపమైన సముద్రాన్ని దాటటానికి, మనోరూపుడైన రావణుని జయించటానికి, జీవాత్మ పరమాత్మలైన సీతారాములు మళ్ళీ కలియటానికి మార్గాన్ని సుగమం చేసిన ఆచార్యవర్యుడు – సద్గురువు అంటారు. మరోక విశేషం ఏమంటే- హనుమ విష్ణ్వంశసంభూతుడైన శ్రీరామచంద్రుని సేవకుడు కావటం చేత వైష్ణవులు, స్వయంగా శివాంశ సంభూతుడు కావటం చేత శైవులు, వాయుపుత్రుడు కావటం చేత మాధ్వులు, మహాశక్తి స్వరూపుడు కావటం చేత శాక్తేయులు – అందరూ ఆయనను ఆరాధిస్తారు.

చరితార్థ జీవి హనుమ
తత్త్వ దృష్టితో, మత దృష్టితోనే కాక సామాన్య మానవ దృష్టితో చూచినా హనుమది ఒక విశిష్ట వ్యక్తిత్వం; చరితార్థ జీవితం.

శ్రీమద్రామాయణంలో ధర్మబద్ధమైనా, ధర్మవిరుద్ధమైనా, ప్రధాన పాత్రల్లో ఎవరి స్వార్థం వారికి వుంది. కాని, ఏ మాత్రం స్వార్థ స్పర్శలేకుండా ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రునకు, ఆ మహాపురుషుడు లోక హితార్థం జరిపిన దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు, ధర్మసంస్థాపనకు తన యావచ్ఛక్తి యుక్తుల్ని, వరదాన బలాన్వితమైన తన జీవితాన్ని అపార భక్తితో సమర్పించుకొన్న శ్రీరామదూత శ్రీ ఆంజనేయుడు. అందుకే ఆ శ్రీరామునితో పాటు, ఈ శ్రీరామ దూతకు ఆలయాలు; అర్చనలు. అందుకే ‘శ్రీరామ దూతం శిరసా నమామి’ అని స్తోత్రాలు.

-అప్పజోడు వేంకట సుబ్బయ్య

రచయిత గురించి:-
“మీరు రామాయణం చదివారా? అయితే ఈ పుస్తకం చదవండి”– పుస్తక రచయిత అప్పజోడు వెంకటసుబ్బయ్య(1935-2024). అనంతపురం, గూడూరు, నంద్యాల, హైదరాబాద్, కర్నూల్లో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేశారు. “మహాభారతం- మానవ స్వభావ చిత్రణ” అన్న విషయం మీద ఉస్మానియాలో పి హెచ్ డి చేశారు. రామాయణ, భారతాల మీద తెలుగునేల మీద కొన్ని వేల ఉపన్యాసాలు చేసి ఉంటారు. భారతి పత్రిక మొదలు అనేక పత్రికలకు కొన్నివేల వ్యాసాలు రాశారు. వందలమంది అభిమానులయిన శిష్యగణాన్ని సంపాదించుకున్నారు. కావలి దగ్గర పుట్టారు. కర్నూల్లో కన్ను మూశారు. ఆయన పుస్తకంలో హనుమంతుడి గురించి రాసిన సుదీర్ఘ వ్యాసంలో కొంత భాగమిది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్