దేశ రాజధాని ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతును కూడగడుతున్న కేజ్రీవాల్ ఇప్పటికే బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన (యూబిటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేలతో సమావేశం కాగా ఈ రోజు (గురువారం) ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ముంబైలోని యశ్వంత్‌రావు చవాన్ సెంటర్‌లో పవార్‌తో కేజ్రీవాల్ సంప్రదింపులు జరిపారు.
ఢిల్లీలో బ్యూరోక్రాట్‌ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల కోసం కేంద్రం నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు దిశగా ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆప్ బీజేపీయేతర పార్టీల మద్దతును కోరింది. ఇది విపక్షాలకు అగ్నిపరీక్ష సమయమని దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే పార్టీలు ముందుకు రావాలని ఆప్ పిలుపు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కత్తిరిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను టీఎంసీ కూడా వ్యతిరేకించింది. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోందని దుయ్యబట్టింది.