మలయాళంలో కథానాయకుడిగా టోవినో థామస్ కి మంచి పేరు ఉంది. ఎలాంటి పాత్రనైనా చాలా సహజంగా ఆవిష్కరించే నటుడాయన. ఈ మధ్య కాలంలో ఓటీటీలోకి అనువాదాలుగా మలయాళ సినిమాలు ఎక్కువగా వస్తుండటం వలన, ఓ మమ్ముటి .. మోహన్ లాల్ మాదిరిగా టోవినో థామస్ కూడా ఇక్కడి ప్రేక్షకులకు చేరువయ్యాడు. ‘మిన్నల్ మురళి’ .. ‘2018’ వంటి ఆయన మార్క్ సినిమాలు ఇక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా సినిమాలను ఇక్కడి థియేటర్లలో రిలీజ్ చేయడం మొదలైంది.
అలా థియేటర్లకు వచ్చిన సినిమానే ‘ఏ ఆర్ ఎమ్’ (అజాయంతే రందం మోషణం). అంటే అజయన్ చేసిన రెండో దొంగతనం అని అర్థం. స్టీఫెన్ – జకారియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి జితిన్ లాల్ దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి – ఐశ్వర్య రాజేశ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా భావించాలి. ఈ కథ మూడు కాలంలో నడుస్తుంది. తాత మణియన్ గా .. మనవడు అజయన్ గా కథానాయకుడు రెండు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తాడు. టోవినో థామస్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడం మరో విశేషం.
కథలకి వెళితే .. మణియన్ ఒక గజదొంగ. అతను చేసిన దొంగతనాల వలన, అతని మనవడు అజయన్ ను కూడా అందరూ దొంగగానే చూస్తూ ఉంటారు. ఎక్కడ ఏ దొంగతనం జరిగినా, అందుకు కారకుడు అతనేనని అందరూ భావిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరు గుడిలోని ప్రాచీన కాలానికి చెందిన ఒక దీపం దొంగిలించబడుతుంది. ఆ దీపాన్ని ఎవరు దొంగిలించారు? దాని చుట్టూ అల్లుకున్న సంఘటనలు ఎలాంటివి? అనేది కథ. స్క్రీన్ ప్లే నిదానంగా అనిపించినప్పటికీ, టోవినో థామస్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ‘మణియన్’ పాత్రలో ఆయన నటన అదుర్స్ అనిపిస్తుంది.