Thursday, September 19, 2024
HomeTrending Newsఎన్నికల వేళ సీజ్ చేసిన సొమ్ము 11 వందల కోట్లు

ఎన్నికల వేళ సీజ్ చేసిన సొమ్ము 11 వందల కోట్లు

2024 సార్వత్రిక ఎన్నికలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాయి. ప్రజాస్వామ్య విలువలపై ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నేతలు… అధికారం చేజిక్కించుకునేందుకు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నోట్ల కట్టలు కుమ్మరించారు. అనుంగు సహచరుల ద్వారా డబ్బు పంపిణీకి సిద్దం చేసిన అక్రమ సొమ్ము తనిఖీల్లో బయటపడింది.

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ దేశ‌వ్యాప్తంగా ఆదాయ‌ప‌న్ను శాఖ నిర్వ‌హించిన సోదాల్లో సుమారు 1100 కోట్ల న‌గ‌దు సీజ్ చేసింది. దీంట్లో న‌గ‌లు కూడా ఉన్నాయి. అధికార వ‌ర్గాల ప్ర‌కారం.. మే 30వ తేదీ వ‌ర‌కు ఆదాయ‌ప‌న్ను శాఖ మొత్తం 1100 కోట్ల విలువైన నగదు, నగలని సీజ్ చేసింది.

మే 16వ తేదీ నుంచి ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమలులోకి రాగా ఆ నాటి నుంచి ఐటీ శాఖ అన్ని రాష్ట్రాల్లో దాడులు, సోదాలు, త‌నిఖీలు ముమ్మరం చేసింది. ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు వాడుతున్న డ‌బ్బు సీజ్ చేశారు. ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక మొత్తంలో సీజ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వంద‌ల కోట్ల‌కు పైగా న‌గ‌దు, నగలు స్వాధీనం చేసుకున్నారు. ఆ త‌ర్వాత  స్థానంలో త‌మిళ‌నాడు ఉన్న‌ది. ఆ రాష్ట్రంలో 150 కోట్ల వ‌ర‌కు సీజ్ చేశారు.

ఏపీ, తెలంగాణ‌, ఒడిశా రాష్ట్రాల్లో సుమారు వంద కోట్ల వ‌ర‌కు న‌గ‌దు ప‌ట్టుకున్నారు. ఈసీ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌ 24×7 కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేసిన ఐటీశాఖ త‌నిఖీలు నిర్వ‌హించింది. 50 వేల క‌న్నా ఎక్కువ న‌గ‌దు, ప‌త్రాలులేని ప‌ది వేల ఖ‌రీదు చేసే వ‌స్తువుల‌ను సీజ్ చేశారు. ప‌ది ల‌క్ష‌ల పైచిలుకు సీజ్ చేసిన కేసుల‌ను.. ఐటీశాఖ పరిశీలనకు పంపిస్తారు.

2019 నాటి ఎన్నిక‌ల‌తో పోలిస్తే సీజ్ చేసిన సొమ్ము 182 శాతం అధికంగా ఉన్న‌ట్లు అధికారుల అంచనా. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ 390 కోట్ల న‌గ‌దు సీజ్ చేశారు. దేశంలో పేదరికం పెరిగిపోతుంటే అధికారం కోసం రాజకీయ పార్టీలు తొక్కని అక్రమ మార్గం లేదు.

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీజ్ చేసిన నగదు విడుదలలో అక్రమాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై ప్రభుత్వ శాఖల మీద ఒత్తిడి తీసుకొచ్చి… తప్పుడు పత్రాలతో సొమ్ము సొంతం చేసుకునే తతంగం సాగుతుందని… ప్రతిసారి ఇలా జరగటం సాధారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్