Sunday, November 3, 2024
HomeTrending NewsGurukuls: నీట్ మొదటి విడతలో గురుకులాలకు 180 ఎంబీబీఎస్‌ సీట్లు

Gurukuls: నీట్ మొదటి విడతలో గురుకులాలకు 180 ఎంబీబీఎస్‌ సీట్లు

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టిన ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ ప్రాజెక్టు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నది. నీట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే దాదాపు 180 మంది ఎంబీబీఎస్‌ సీట్లు సాధించారు. సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల నుంచి 135 మంది, గిరిజన గురుకులాల నుంచి 45 మంది సీట్లు పొందారు. వీరిలో రెగ్యులర్‌ ఇంటర్‌ విద్యార్థులు 30 మంది, లాంగ్‌టర్మ్‌ నుంచి 105 మంది ఉన్నారు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలకు చెందిన ఐదుగురు విద్యార్థులు కూడా మెడికల్‌ సీట్లు సాధించారు.

మొదటిసారిగా పర్టిక్యులర్‌ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌ (పీవీటీజీ)కు చెందిన విద్యార్థిని సైతం ఎంబీబీఎస్‌ సీటు సాధించారు. పీవీటీజీకి చెందిన సంగర్సు స్రవంతి కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో సీటు దక్కించుకుంది.

తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ అందించేందుకు ఎస్సీ గురుకులాల్లో ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ (ఓపీబీసీ), గిరిజన గురుకులాల్లో ఆపరేషన్‌ ఎమరాల్డ్‌ (ఓపీఎం) ప్రారంభించింది. ఈ ఏడాది ఓపీబీసీ కింద 223 మందికి శిక్షణ ఇవ్వగా, వారిలో 153 మంది ర్యాంకులు సాధించారు. రెగ్యులర్‌ గురుకులాల నుంచి మరో 50 మంది అర్హత పొందారు. మొత్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచే ఈసారి 203 మంది ర్యాంకులు సాధించారు. ఓపీఎం కింద ఈ ఏడాది 93 మంది గిరిజన విద్యార్థులకు నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ ఇవ్వగా, వారిలో 64 మంది ర్యాంకులు సాధించారు. మరో 8మంది రెగ్యులర్‌ గురుకులాలకు చెందినవారు కలుపుకొని మొత్తంగా గిరిజన గురుకులాల నుంచి 72 మంది అర్హత సాధించారు. ఓపీబీసీ, ఓపీఎం నుంచి 185 మంది తొలి విడత కౌన్సిలింగ్‌లో సీట్లు పొందారు.

గురుకుల విద్యార్థులు గతంలో కంటే ఎక్కువగా మెడికల్‌ సీట్లను సాధించడంపై మంత్రులు సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ సెక్రటరీ షఫీవుల్లా హర్షం వ్యక్తం చేశారు.

గురుకులం వల్లే సాధ్యమైంది – సంగర్సు స్రవంతి
మాది ఆసిఫాబాద్‌ జిల్లా చండ్రపల్లి గ్రామం. నాన్న చిన్నతనంలోనే చనిపోయారు. అమ్మ కూలీ పనులు చేస్తూ చదివించింది. గురుకులంలో ఉచితంగా నీట్‌ కోచింగ్‌ లేకపోతే మెడికల్‌ సీటు వచ్చేది కాదు. మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి పరీక్షకు సిద్ధమవుతానని అనుకోలేదు. అధ్యాపకుల ప్రోత్సాహం, శిక్షణతో నీట్‌లో మంచి ర్యాంకు సాధించా. కరీంనగర్‌ ప్రతిమ మెడికల్‌ కాలేజీలో సీటు రావడం ఆనందంగా ఉంది. రెసిడెన్షియల్‌ కళాశాలలను స్థాపించి నాలాంటి పేదలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్