టోక్యోలో ఒలింపిక్స్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటి టోక్యోలో జపాన్ ఒలింపిక్స్ కమిటితో కలిసి క్రీడా వేదికలను సిద్ధం చేసే పనిలో వుంది. కరోనా రెండో దశలో ప్రజలు అల్లాడుతుంటే ఈ ఈవెంట్ ఏళ్ళ నిర్వహిస్తారంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన తాజా సర్వేలో 43 శాతం మంది ఈ విశ్వ క్రీడా వేడుకల నిర్వహణను గట్టిగా వ్యతిరేకించగా మరో 40 శాతం మంది మరి కొన్నాళ్ళు వాయిదా వేయాలని అభిప్రాయపడ్డారు.
జపాన్ వైద్య సిబ్బంది ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని, ఒలింపిక్స్ మొదలైతే వారిపై ఒత్తిడి మరింత తీవ్రమవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టోక్యో ఒలింపిక్స్ 2020 జూలై 24 నుంచి ఆగష్టు 8 వరకు జరగాల్సి వుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న మహమ్మారి కరోనా కారణంగా పోటీలను ఈ ఏడాదికి వాయిదా వేశారు. 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకూ జరగనున్నాయి. ప్రేక్షకులను అనుమతించకుండా, కోవిడ్ నిబధనలు పాటిస్తూ ఈ ఏడాది గేమ్స్ నిర్వహించాలని ఆర్గనైజింగ్ కమిటి నిర్ణయం తీసుకుంది. మార్కెటింగ్, బ్రాండింగ్ అవసరాల కోసం పేరు మార్చకుండా ఒలింపిక్స్-2020 పేరిట ఈ విశ్వ క్రీడా వేడుకలు నిర్వహిస్తున్నారు.