Sunday, January 19, 2025
HomeTrending NewsUCC: ఉమ్మడి పౌర స్మృతి అమలుకు కార్యాచరణ

UCC: ఉమ్మడి పౌర స్మృతి అమలుకు కార్యాచరణ

సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్న… ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు ఉమ్మడి పౌర స్మృతి అమలుకు కసరత్తు జరుగుతోంది. దీపావళి తర్వాత ఉత్తరాఖండ్లో యూనిఫాం సివిల్ కోడ్(UCC) అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత గుజరాత్, అస్సాంలలో కూడా అమలు చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

అదే జరిగితే UCC నియ‌మావ‌ళిని అమ‌లు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్త‌రాఖండ్ దేశ చరిత్రలో నిలువ‌నున్న‌ది. వ‌చ్చే వారం నుంచి యూనిఫాం సివిల్ కోడ్‌ను ఉత్త‌రాఖండ్ అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ జ‌స్టిస్ రంజ‌న దేశాయ్ క‌మిటీ నివేదిక‌ను సీఎం పుష్క‌ర్ సింగ్ ధామికి అందచేసేందుకు సిద్దమైనట్టు సమాచారం. దీపావ‌ళి త‌ర్వాత ఉత్త‌రాఖండ్ ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించి, ఆ స‌మావేశాల్లో ఉమ్మ‌డి పౌర స్మృతికి ఆమోదముద్ర వేసే అవ‌కాశాలున్నాయి.

ఉమ్మ‌డి పౌర స్మృతి నియ‌మావ‌ళి డ్రాఫ్ట్‌ను పూర్తి చేసిన‌ట్లు యూసీసీ డ్రాఫ్ట్ క‌మిటీలో సభ్యురాలైన జ‌స్టిస్ రంజ‌న దేశాయ్‌ ఇటీవల తెలిపారు. నిపుణుల క‌మిటీ ఇచ్చే రిపోర్టుతో పాటు తీర్మానాన్ని కూడా ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వానికి అంద‌జేయ‌నున్న‌ట్లు జ‌స్టిస్ దేశాయ్ వెల్లడించారు.

ఉమ్మడి స్మృతి కార్యాచరణ దాలిస్తే… పెళ్లి, విడాకులు, ఆస్థి పంపకాలు,వారసత్వం, దత్తత తదితర అంశాల్లో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టం అందరికి వర్తిస్తుంది. మన దేశంలో ప్రస్తుతం మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో ఒకే చట్టాన్ని తీసుకురావడం యూసీసీ ఉద్దేశం.

నేరం చేస్తే ఏ మతం వారికైనా ఒకే శిక్ష వేసినట్టుగా యూసీసీతో బ‌హుభార్య‌త్వాన్ని ర‌ద్దు చేయ‌నున్నారు. స‌హ‌జీవ‌నం చేసుకోవాల‌నుకున్న వారు రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌న్న నిబంధ‌న పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. ఉమ్మడి స్మృతితో సమాన హక్కులు లభిస్తాయి. మహిళలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని సున్నితమైన, వివాదాస్పదమైన అంశాలను సైతం తొలగించవచ్చు.

విభిన్న ఆచారాలు,మతాలు, సాంప్రదాయాలకు నెలవైన మన దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులకు వేరువేరుగా చట్టాలు ఉన్నాయి. పెళ్లి నుంచి విడాకులు, ఆస్థి పంపకం వరకు వేర్వేరు చట్టాలున్నాయి. అలాంటి భారతదేశంలో యూసీసీని అమలు చేయాలంటే కష్టతరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2024 లోక్‌స‌భ ఎన్నిక‌లకు ముందే బిజెపి పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలు జరిగితే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాదానాంశంగా నిలిచే సూచనలు ఉన్నాయి. దీంతో ఎన్నికల ముఖచిత్రమే మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం… బిజెపికి సానుకూలత ఉంటే ఉమ్మడి పౌర స్మృతి అమలు శరవేగంతో జరుగుతుందని అంచనా ఉంది.

ఇప్పటివరకు జమ్ముకాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో ఆలయ నిర్మాణం అంశాల్లో కాషాయ దళం సఫలీకృతం  అయింది. ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తే అనేక మార్పులు ఉంటాయి. మహిళలకు సమన హక్కులు దాఖలు పడతాయి. బహిరంగంగా సమర్థించక పోయినా ముస్లిం మహిళలు ఎన్నికల్లో బిజెపిని బలపరుస్తారనే వాదన ఉంది.

-దేశవేని భాస్కర్

Also Read: Badrinath: ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షం..బద్రీనాథ్ రోడ్ బ్లాక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్