ప్రపంచం ఇప్పుడంటే కరోనాతో విలవిలాడుతోంది కానీ…అంతకు ముందు కూడా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉండేది. అలాంటి వాటిల్లో జుట్టు రాలిపోవడం, బట్ట తల, మొహం మీద మచ్చలు, చర్మం ముడుతలు పడడం లాంటి సవాలక్ష సమస్యలు. పైకి చిన్నవిగా కనిపించినా ఇవన్నీ ఏటా లక్షల కోట్ల వ్యాపారానికి ఆధారమయిన సమస్యలు.
ఇందులో బట్టతలకు వెంట్రుకలు కృత్రిమంగా ఏర్పాటు చేయడం పెద్ద శాస్త్రీయ సౌందర్య విషయం. వరి నాట్లు వేసినట్లు ఒక్కొక్క వెంట్రుకను బట్టతల మీద నాటాలి. నాటిన వెంట్రుక వెంటనే ఊడిపోకుండా పాదుకుని, ఎదగడానికి నూనెలు పూయాలి. ఎరువులు వేయాలి. పురుగులు వాలకుండా మందులు చల్లాలి. నిగనిగలాడడానికి నలుపు రంగు పూలమాలి. నున్నని, గుండ్రని బట్ట తల మీద నాలుగు వెంట్రుకలు కృత్రిమంగా అయినా మొలవగానే వచ్చే అందం, ఆనందం, ఆత్మ విశ్వాసం మాటలకందేది కాదు.
ప్రపంచవ్యాప్తంగా బట్ట తలలు ఇక తలలు దించుకోవాల్సిన పనిలేదు. సగర్వంగా తల ఎత్తుకుని తిరిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బట్టతలకు శాశ్వత పరిష్కారాన్ని అమెరికాలో శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఎందువల్ల బట్టతల ఏర్పడుతుందో తెలిసిపోయింది. బట్ట తల దగ్గర చర్మం లోపలి పొరల్లో ఒక ప్రోటీన్ పదార్థం ఏర్పడడం వల్ల వెంట్రుకలు పెరగడం లేదని గుర్తించారు. ఆ ప్రోటీన్ ను తొలగించగానే వెంట్రుకలు మామూలుగా పెరగడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకల మీద ఈ ప్రయోగాలు ఫలించాయి. మనుషుల మీద ప్రయోగిస్తున్నారు. ఫలితాలు ఆశాజనకంగానే ఉంటాయట. అంటే ఇక బట్టతలలు కనపడవు!