Sunday, November 3, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమురళి రవళి - అరుణ్ మొళి

మురళి రవళి – అరుణ్ మొళి

ఓ ఫైన్ మార్నింగ్… చక్రవాకం, భాగేశ్వరీ కలిసి వాకింగ్ చేస్తున్నాయి. మధ్యలో కనిపించిన ఇళయరాజాను చూసి ఇట్టే ఆకర్షితులై మోహంలో పడ్డాయి. ఆ మోహాన్ని కాదనలేని మొహమాటంతో రాజా.. మరిన్ని రాగఛాయలద్ది.. ఆ వేకువ జాముకో పాట వినిపించాడు. నిత్యం ఉదయాన్ని చూస్తూనే ఉన్నా.. ఉదయమంటే ఇదీ అనే రీతిలో ఆ పాట విన్న మణి.. పీసీ శ్రీరామ్ అనే కెమెరా కన్నుతో దాన్ని తెరకెక్కించాడు. టీవీలో ఎంట్రీ ఇవ్వని కాలంలో జనరంజనిలో రేడియోలో అలరించినా.. ఆ తర్వాత నిత్యం మన ఇళ్లల్లో వింటూ అందమైన ఉదయాన్ని మరింత అందంగా తరచి చూస్తున్నా.. ఆ పాట పేరు ఆమనీ పాడవే హాయిగా. వేటూరీ గీతరచన.. రాజా స్వరకల్పన.. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ.. మణిరత్నం దర్శకత్వం.. బాలూ గానం వెరసి ఆ పాట హిట్టనుకుంటే.. ఆ పాట చిత్రీకరణతోనే ఊటీ పర్యాటకం మరింత పెరిగిందనుకుంటే.. ఇంకొక్కటి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ విశేషమే.. ఆ పాటలో ఎవరబ్బా అనిపించేలా వేణునాదాన్ని వినిపించిన ఫ్లూటిస్ట్ నేమ్. అదే ఇళయరాజా నచ్చి, మెచ్చిన అరుణ్ మొళి అనే ప్రఖ్యాత వేణునాద వాద్యకారుడి సంతకం.

ఒరే మురై ఉన్ దర్శనం… ఆ తమిళ పాట ఇంటర్ నోట్స్ గమనిస్తే… అరుణ్ మొళి అలియాస్ నెపోలియన్ సెల్వరాజ్ ప్రతిభ అర్థం చేసుకోవచ్చు. సినీ సంగీతంలో ఇప్పుడు ఏ. ఆర్. రెహమాన్ దగ్గర ఉన్న ఫ్లూటిస్ట్, కంపోజరైన నవీన్ పేరు బాగా ప్రాచుర్యంరలోకి ఎలాగైతే వచ్చిందో.. ఆ స్థాయి పిల్లనగ్రోవి వాద్యకారుడైన నెపోలియన్ పేరు చెప్పుకోకుంటే.. సినీ సంగీత ఆర్కెస్ట్రైజేషన్ సంపూర్ణం కాదు.

ఫ్లూటిస్ట్ అంటే కేవలం సంగీత దర్శకుడిచ్చే నొటేషన్స్ మాత్రమే ఫాలో అవ్వడం కాదు.. వాటికి మరింత మెరుపులు, చమకులు అద్దే మనోధర్మాన్నెరిగి ఉండాలి. పాటకు ప్రాణం పోయాలి. జీవం ఉట్టిపడాలి. విన్నకొద్దీ వినేలా చేయాలి. అది అరుణ్ మొళి అనే ఓ ఫ్లూటిస్ట్ ను తన ట్రూప్ లోకి ఎంపిక చేయడంతో నిజం చేయగల్గాడు ఇళయరాజా.

పై చదువుల కోసం మద్రాస్ బస్సెక్కి.. మార్గమధ్యంలో సర్టిఫికెట్స్ పోగొట్టుకుని సినిమా సంగీతంలో నంబర్ వన్ ఫ్లూటిస్ట్ గా పేరుగాంచిన వేణువాద్యకారుడు అరుణ్ మొళి. ఉయరంద ఉల్లమ్ అనే సినిమాలో వాంతమ్ మహాలక్ష్మి అనే పాటకు ఇళయరాజా వద్ద మొట్టమొదట ఇతర ఫ్లూటిస్ట్స్ తో కలిసి చెన్నై ప్రసాద్ స్టూడియాలో భాగస్వామయ్యాడు. ఆ తర్వాత అరుణ్ మొళి ఉరఫ్ నెపోలియన్ ప్రతిభకు ముగ్ధుడైన రాజా… తన ట్రూప్ లో చేరిపొమ్మన్నాడు. అలా 1984వ సంవత్సరం నెపోలియన్ అనే ఓ ఫ్లూటిస్ట్ తమిళ చిత్రసీమలో పాప్యులర్ వేణునాద వాద్యకారుడిగా వడివడిగా ఎదిగేందుకు అడుగులు పడ్డాయి.

అయితే, కేవలం అరుణ్ మొళి ఫ్లూటిస్ట్ గానే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా సుపరిచితుడు. ఇళయరాజాతో పాటు.. దేవా, కార్తీక్ రాజా, సిర్పి, ఎస్.ఏ. రాజ్ కుమార్, శంకర్ గణేషన్, యువన్ శంకర్ రాజా, హారిస్ జైరాజ్, శివ, మాస, దిన, విద్యాసాగర్, సౌందర్యన్.. ఇలా ఎందరి వద్దో నేపథ్యగానంతోనూ.. తన వేణునాదమంత వండర్స్ చేశాడు. అయితే, ఇళయరాజా ఆస్థాన విద్వాంసుడిగా చేరాకే… శంకులో పడ్డ తీర్థంలాగా నెపోలియన్ తన ప్రతిభకు మరింత సానబెట్టే అవకాశం దక్కింది. చాలాకాలం క్లబ్బుల్లో, ఇతర ఆర్కెస్ట్రాల్లో సెల్ఫ్ మేడ్ ఫ్లూటిస్ట్ గా ప్రోగ్రామ్స్ చేసుకున్న నెపోలియన్ సినిమా ఎంట్రీ.. 1980వ దశకంలో శంకర్స్మ్ అనే మళయాళ మూవీతో.. శంకర్ గణేషన్ అనే సంగీత దర్శకుల వద్ద ప్రారంభమైంది.

స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత ఓ ఫార్మాసెట్యుకల్ కంపెనీలో వర్కింగ్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. ఓ అద్భుతమైన వేణు నాద కళాకారుడిగా ఎదుగుతాడని అసలు ఆ అరుణ్ మొళే అనుకోలేదేమో బహుశా! పాడు నిలవే అనే తమిళ సినిమాలో మలైయోరుమ్ వీసుమ్ కాటు.. అలాగే, సెమీ క్లాసికల్ రీతిలో వినిపించే పల్లవియే శరణమ్ అనే పాటలకు వాయించిన పిల్లనగ్రోవి వాద్యం ఆయన ప్రతిభను సినీ బాహ్య ప్రపంచానికి చాటింది. 1984లో ఎన్ జీవన్ పాడుతూ అనే సినిమాలోని ఓరె మురై ఉన్ దర్శనమ్ అనే పాట.. మిగతా ఫ్లూటిస్టులతో పోలిస్తే నెపోలియన్ ఎందుకు బెటర్ అండ్ బెస్టో సినీ సంగీత ప్రపంచానికి తెలియజెప్పింది. అలా ఆ పాటతో నెపోలియన్ ఇళయరాజా ఎక్స్ క్లూజివ్ ఫ్లూటిస్ట్ గా మారిపోయారు. వన్న వన్న పోక్కల్ లోని కే. జే. యేసుదాసు ఆలపించిన ఇల నెంజేవా, గోపుర వాసలిలేలో ఎస్. జానకీ పాడిన తాలాత్రూ పుంగాట్రు, సత్య సినిమాలోని వలై ఓసై గలగల అంటూ.. తెలుగులో పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని కవితలు పలికే అంటూ వినిపించిన ఏ పాటలోనైనా ఇళయరాజా మ్యూజికల్ ఇంటర్ నోట్స్.. ఆ ట్యూనింగ్స్ ఎంతగా అలరిస్తాయో.. వాటికి తన ఫ్లూట్ తో అంత ప్రాణం పోశాడు నెపోలియన్.

ఓ ఫ్లూటిస్టే కాదు.. సూర సంహారం సినిమాలో చిత్రతో కలిసి నాన్ ఎంబదో నీ ఎల్లవో వంటి పాటను అరుణ్ మొళి నేపథ్యగాయకుడిగా పాడిన తీరు ఓ ప్రొఫెషనల్ సింగర్ స్థాయి ఏ విధంగా ఉండాలో చెబుతుంది. పున్నై వన పూంగుయిలే, వాసాకరు వేపిలయే, వెన్నెలవుక్కు వానత పుడిక్కలయ, వెళ్లి కొలుసు మణి వంటి పాటలెన్నో నేపథ్య గాయకుడిగా తన ఫ్లూట్ వాద్యంతో పోటీ పడేలా పాడటం అరుణ్ మొళి ఉరఫ్ నెపోలియన్ ప్రత్యేకత. కార్తీక్ రాజా సంగీత దర్శకత్వం వహించిన ఎనక్కోర్ మగన్ పిరప్పన్ సినిమాతో పాటు… విద్యాసాగర్ అనే ప్రతిభావంతమైన మరో అద్భుత సంగీత దర్శకుడు కంపోజ్ చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ అరసియాల్ అనే సినిమాలోని పాటల గీత రచయితగా కూడా నెపోలియన్ బహుముఖ ప్రజ్ఞ సినీ సంగీతంలో చెప్పుకోవాల్సింది.

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో అన్న ఓ సినీకవి అక్షరరూపానికి.. ప్రతిబింబాన్ని వెతికితే… ఆ నిలువెత్తు రూపం నెపోలియన్ సెల్వరాజ్ అలియాస్ అరుణ్ మొళి.

-రమణ కొంటికర్ల

RELATED ARTICLES

Most Popular

న్యూస్