Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅడుగడునా మహిమాన్వితం.. అర్వపల్లి నృసింహ క్షేత్రం!

అడుగడునా మహిమాన్వితం.. అర్వపల్లి నృసింహ క్షేత్రం!

ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం!!

శ్రీమన్నారాయణుడు లోక కల్యాణం కోసం 21 అవతారాలను ధరించగా, వాటిలో దశావతారాలు మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి.  దశావతారాలలో నాల్గోవ అవతారం .. నృసింహ అవతారం. శ్రీరాముడు .. శ్రీకృష్ణుడు వంటి అవతారాలను ధరించడానికి ముందు నారాయణుడు ఇంద్రాది దేవతలను సమావేశపరిచి వ్యూహాత్మక ప్రణాళిక రచన చేశాడు. కానీ నృసింహ అవతారం అలా కాదు. తన భక్తుడిని రక్షించడం కోసం .. భగవంతుడు ఉన్నాడనే ఒక నమ్మకాన్ని నిలబెట్టడం కోసం .. సంకల్ప మాత్రం చేత స్వామి స్థంభం నుంచి ఆవిర్భవించాడు. అదే నృసింహస్వామి అవతారం ప్రత్యేకత.

అలాంటి నృసింహస్వామి కొలువైన ప్రసిద్ధమైన క్షేత్రాలు తెలంగాణలో ఎక్కువగానే కనిపిస్తాయి. ప్రాచీనమైన ఆ క్షేత్రాల జాబితాలో యాదాద్రి .. మట్టపల్లి .. వాడపల్లి .. అర్వపల్లి కనిపిస్తాయి. నృసింహస్వామి తన అవతార కార్యానికి తగినట్టుగా కొండపై కొలువుదీరడం మనం గమనించవచ్చు. ఆ స్వామి కొండలపై గుహలలో వెలసిన క్షేత్రాలు మనకి కనిపిస్తాయి. అయితే కొండపై ఉన్న ఆ స్వామి కొండ దిగివచ్చి ఆవిర్భవించడమనే ఒక అరుదైన సంఘటన ‘అర్వపల్లి’లో జరగడం స్థలపురాణంలో కనిపిస్తుంది.

సూర్యాపేట జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రంగా అర్వపల్లి విరాజిల్లుతోంది. ఇక్కడ వందల ఏళ్లుగా శ్రీ యోగానంద లక్ష్మీనృసింహస్వామి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. సూర్యాపేట నుంచి అర్వపల్లి వెళ్లేదారి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అటూ ఇటూ పచ్చని పొలాలు .. పచ్చని చెట్లను పెంచుతున్నట్టుగా అనిపించే గుట్టలు గుంపులుగా కనిపిస్తాయి. స్వామివారు ఆవిర్భవించిన కొండకి సమీపంలో ఉన్నా చాలనుకుని గుట్టలన్నీ పోటీ పడుతూ ఆ దిశగా పరిగెడుతున్నట్టు కనిపిస్తాయి. స్వామివారి మహిమలను మనతో పంచుకోవడానికి ఆరాటపడుతున్నట్టుగా అనిపిస్తాయి.

అర్వపల్లి గ్రామం మధ్యలోనే స్వామివారి ఆలయం కనిపిస్తుంది. కాకతీయుల కాలం నాటి ఆలయం శిధిలం కావడంతో, ఈ మధ్యనే కొత్తగా ఈ ఆలయాన్ని మరింతగా విస్తరిస్తూ నిర్మించారు. సువిశాలమైన మంటపం .. ఆధ్యాత్మిక వాతావరణాన్ని అక్కున చేర్చుకున్నట్టుగా … భక్తి  భావాలను వెదజల్లుతున్నట్టుగా అనిపిస్తుంది. గర్భాలయంలో స్వామివారు యోగానంద లక్ష్మీ నృసింహుడిగా దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారి రూపం కుదురుగా కనిపిస్తూ ఉంటుంది.ఇది ఏ శిలతో ఎవరూ చెక్కినదికాదు అనే విషయం చూడగానే తెలిసిపోతూనే ఉంటుంది.

కాకతీయుల సామంత రాజైన అన్నపరాయ గణపతి ఏలుబడిలో ఈ ప్రాంతం ఉన్నప్పుడు, ఇక్కడి కొండపై నృసింహస్వామి ఆలయం ఉండేదట. ఆ స్వామి అన్నపారాయలవారికి స్వప్నంలో దర్శనమిచ్చి,  తాను భక్తులతో పూజలు అందుకునే సమయం ఆసన్నమైనదని చెప్పి, కొండ దిగువున ఒక కొయ్య రథాన్ని ఏర్పాటు చేయమని సెలవిచ్చాడట. అన్నపరాయ గణపతి అలాగే చేయగా, అందరూ చూస్తుండగానే స్వామి ‘శ్వేతనాగు’ రూపంలో కొండదిగివచ్చి రథంపైకి చేరుకున్నాడట.

అలా సర్పం రూపంలోని స్వామివారితో బయల్దేరిన రథం ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి రాగానే ఆగిపోయింది. అప్పట్లో ఇక్కడ అనేక పుట్టలు ఉండటంతో వాటి మధ్యలోకి వెళ్లిన సర్పం అదృశ్యమైంది. ఆ తరువాత భక్తులు నీళ్లతో పుట్టలను తడుపుతూ వెళ్లగా, ఒక పుట్టలో నుంచి స్వామి స్వయంభూ మూర్తి వెలుగు చూసింది. కొంతమంది నాస్తికులు ఇది పెట్టుడు విగ్రహమని ప్రచారం చేసి, అది నిరూపించడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడం గురించి గ్రామస్థులు కథలు కథలుగా చెప్పుకుంటారు.

స్వామివారు తన ఆవిర్భావంతోనే ఇది మహిమగల క్షేత్రమని చాటడం విశేషం. ఇప్పటికీ గర్భాలయంలో స్వామివారి సన్నిధిలో ‘పుట్ట’ ఉంటుంది .. ఆలయ పరిసరాలలో అప్పుడప్పుడు ఒక శ్వేతనాగు సంచరించడం ప్రత్యక్షంగా చూసిన వారున్నారు. అయితే ఇప్పటికీ ఈ కొండ ఒక కోణంలో స్వామివారి ఆకారంలో కనిపిస్తూ ఉండటం విశేషం. స్వామివారు కిరీటాన్ని ధరించిన విష్ణు స్వరూపంగా దర్శనమిస్తూ ధన్యులను చేస్తుంటాడు. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనడానికి కొండంత కొలమానం ఇది.

ఇక్కడి గ్రామస్తులంతా స్వామివారిని తమ ఇష్టదైవంగా .. ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటారు. ఉగాది .. ముక్కోటి ఏకాదశి .. నృసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు .. విశేషమైన సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నుంచి మాఘ బహుళ త్రయోదశి వరకూ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 18 రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవ వేడుకలలో స్వామివారు వివిధ వాహన సేవలపై కనువిందు చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ జరిగే రథోత్సవాన్ని తిలకించడానికి రెండు కళ్లూ చాలవు.

మాఘశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి కల్యాణోత్సవం జరుగుతుంది. ఆ రోజున స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. స్వామివారికి కట్నకానుకలు చెల్లించుకుని వెళుతూ ఉంటారు. ఇక్కడికి సమీపంలోని ‘జాజిరెడ్డిగూడెం’లోని ప్రాచీన కాలంనాటి ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకురావడం ఒక ఆనవాయితి. ఆ సంబరంలో .. ఆ సందడిలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహాన్ని చూపుతారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20 వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన భయాలు .. వ్యాధులు .. బాధలు  దూరమవుతాయనేది భక్తుల విశ్వాసం. దోషాలు .. పాపాలు నశిస్తాయనేది భక్తులు అనుభవపూర్వకంగా చెప్పేమాట.

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగింద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే!
యోగేశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్!!

– పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్