Saturday, April 20, 2024
Homeసినిమాకె. విశ్వనాథ్ ఎందుకు ఇష్టమంటే....

కె. విశ్వనాథ్ ఎందుకు ఇష్టమంటే….

నాకు కె.విశ్వనాథ్ అంటే ఎందుకు ఇష్టం….  ఆఁ..పెద్ద చెప్పొచ్చావు లేవోయ్. విశ్వనాథ్ అంటే మాకూ ఇష్టమే అని మీరనొచ్చు. తప్పకుండా మీకు కూడ ఇష్టమవ్వచ్చు.

బహుశః నాకు ఏడు ఏళ్ళ వయస్సులో నేను, మా తమ్ముళ్లు, చెల్లెలు ఒక సినిమా చూశాము. ఆ సినిమాలో పల్లెటూరు లోని ఒక రైతు ఇంటికి కామందు గారు వచ్చి ఆ రైతు ఇంట్లో భోజనం చేస్తారు. వారింట్లోని చిన్నపిల్లలు కామందు గారికి వడ్డన చేస్తూ ఓ పాట పాడతారు. ఆపాట మాకు బాగ నచ్చేసింది.

మారాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారు
అనే పాట.ఆరోజుల్లో అస్తమానూ అదే పాటను హమ్చేసుకుంటూ ఆటలాడుకునే వాళ్ళం.

ఓరోజు మా చుట్టాలొకరు కాలం చేశారు. ఆ సందర్భంగా మా ఇంట్లో భోజనాలు అవుతున్నాయి.మేము పిల్లలం కూడ వడ్డన అందుకున్నాము. ఆరోజు వంకాయ కూర వడ్డిస్తూ మా చెల్లెలు …

అత్తమ్మ వండిన గుత్తి వంకాయండీ
మచ్చు చూసారంటే మళ్ళీ తెమ్మంటారండీ అని హమ్ చేస్తూ వడ్డించింది.

అంతే!ఇలాంటప్పుడా అలా పాటలు పాడడంఅంటూ పెద్దలంతా దానిపైన ఒంటికాలిమీద లేచారు. నాకెందుకో మాచెల్లి తప్పేమీ లేకపోయినా అందరూ అనవసరంగా దాన్ని తిట్టారు అనిపించింది. ఈ సంఘటన నా మనస్సులో అట్లా ముద్ర పడిపోయింది.

అప్పటికి సినిమా అంటే నాగేశ్వరరావు, రామారావు, రేలంగోడు వీళ్ళు మాత్రమే తెలిసున్న రోజులు. తర్వాత రోజుల్లో నేరము శిక్ష, చెల్లెలి కాపురం చూశాను. బాగున్నాయి.

కాని ఉండమ్మా బొట్టు పెడతా ఆ చిన్నతనంలోనే ఆ పాటలు ఎందుకో బాగ నచ్చాయి. ముఖ్యంగా రావమ్మా మహాలక్ష్మీపాట. ఆ పల్లెటూరి సంక్రాంతి చూశాను నేను. అలాగే మా పొలాలలో పొలం పనులన్నీశ్రీశైలం మల్లన శిరసొంచేనా‘  పాటలో చూపించారు. కాస్త సాహిత్యం మీద అభిమానం పెరిగిన కొద్దీ పెద్ద ఉసిరికాయ తిన్నాక మంచినీళ్లు తాగితే ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. ఎవరేమనుకున్నా నాకు మాత్రం విశ్వనాథ్ గారి సినిమా పాటలలో సహజత్వం అంటే ఆ పాటలే! (ఇదే విషయం ఆయనతో చెప్పాను కూడ)
ఏటికైనా ఏతాము ఎత్తేవాళ్ళం మేము అన్నాదమ్ములం
ఏడేడు గరిసెల్లు నూర్చేవాళ్ళం మేము అక్కాచెల్లెళ్ళం
గాజుల చేతిలో రాజనాల పంట

వగరస్తూ గుండెదాక పగిలిందీ నేల
అడుగడుగునా బంగారం
ఆకుపచ్చని సింగారం
తొడగవమ్మ ఈనేలకు సస్యశ్యామల వేషం

ఈ సినిమా తర్వాత కొన్ని వేలపాటలొచ్చాయి. కానీ ఇంత అందమైన, అర్ధవంతమైన, ఎదలోతుల నుండి వచ్చిన అభివ్యక్తి మరేదీ లేదు.

జయహో దేవులపల్లి కృష్ణశాస్త్రీ!!!!
అచ్చ తెనుగంటే ఇదీ!!
అందులోదే మరోపాట….

తల్లి తండ్రి గురువు పెద్దలు
పిల్లలు కొలిచే దైవం
కల్లాకపటం తెలియని పాపలు
తల్లులు వలచే దైవం
ఇంతకన్నా ప్రత్యక్ష దైవాలను చూపించగలమా? ఎంత గొప్ప ఊహ

మల్లీశ్వరిలో దేవులపల్లి భావుకత పైమెట్టు మీద ఉంటే ఉండమ్మా బొట్టు పెడతాలో ఎన్నో మెట్లు దిగొచ్చి మన చెయ్యట్టుకుని మనల్ని తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు దేవులపల్లి.
ఇక ఈ పాట చూడండి….

చుక్కలతో చెప్పాలని ఉందిఅంటున్నాడు..
ఏమని‘,  ‘ఇక్కడ ఏకాంతంలో ఏమో….ఏమేమో….అని
శృంగారానికి.. అంగారానికి తేడా తెలియని మహామహా దర్శకులకు శృంగారమంటే ఏమిటో…. అది ఎంత సింగారంగా చూపించవచ్చో తీసి చూపించాడు విశ్వనాథుడు.

సిగలో పూలు సిగ్గుపడుతున్నాయట ఆ ఏకాంతంలో ఏమో…ఏమేమో….
చూసి….
అందుకే విశ్వనాథ్ అంటే నాకిష్టం.

మన దర్శకులలో నియంత విశ్వనాథ్…
లేకపోతే ఏంటండీ…
మరే దర్శకుడైనా
మాంగల్యానికి మరో ముడి తీస్తాడుటండీ…..
మొదటి ముగింపే ఉంచేస్తే బాగుండేది అనిపిస్తుంది నాకు.
పోనీ ఓసారి బొప్పి కట్టింది కదా….
అయినా సరే
అదే సబ్జెక్టు…
ఈసారి…
సంప్రదాయం చీర కట్టి….
కూచిపూడి గజ్జెలు కట్టి…..
ఇంకాస్త పదును పెట్టి…
అమరావతిలో కొలువు పెడితే….
ఆ జంధ్యాల గారొకడు…
ఉపనిషత్తులు, పెళ్ళి మంత్రాలు మానవత్వానికి మరో రూపాలంటూ…
యాజులైనా…రాజులైనా..
ఇది తెలుసుకోని నాడు తరాజులు కాక తప్పదని సిరా విదిలించేశాడు…
విశ్వనాథ్..జంధ్యాల కలసి ప్రేమ పడవ పైకి ఏడడుగులూ వేయించేశారు…సప్తపది మంత్రంలో సాఖ్యం సప్తపదీనం చేయించేశారు.ఈ సబ్జెక్ట్ ముట్టుకోవాలంటే
ఎంత దమ్ముండాలండీ దర్శకుడికి…..
అదుగో ….అందుకే ఆయనంటే ఇష్టం!!!!
పైగా మంత్రానికి డాన్స్ చేయిస్తాడా….
అంతే కాదండోయ్…
డోలాయాంచల డోలాయామ్ అంటూ ఉయ్యాల్లో జోల పాడేస్తాడు…(జోలాయమ్మ జోల పాడించాడు కదా)..
అందుకే ఆయనంటే ఇష్టం!!

సినిమా పుట్టిన తరువాత ఎవరూ చెయ్యలేకపోయిన ఫీట్ ఒకటి చేశాడాయన.
నాయకుడేమో అంధుడు…
నాయకురాలు మూగ….
ఈ ఇద్దరూ కలసి ఇంకో చిన్నారి అంధురాలిని సిరివెన్నెలలో ఓలలాడిస్తారు.
ఏమి ధైర్యమండీ….కనుకనే
ఆయనంటే నాకు ఇష్టం!!!

ఒకరు కటకటాల వెనుక…
మరొకరు కటకటాలకు కాపలా
చేరెదటకో తెలిసీ…చేరువ కాలేమని తెలిసీ
ప్రేమబంధాన్ని వదులుకోలేని జంటగా
తెలిసి..తెలిసి …తెలిసి
ముడి వేసిన కొంగునే
గుడి ఉంది చూసుకో
గుడిలోని దేవతను
గుండెల్లో దాచుకో
అని వేటూరి చేత ఆ పెళ్ళి మర్మాన్ని చెప్పించారు. దైవావిష్కారం చేయించారు.
ఏకులమూ నీదంటే గోకులము నవ్వింది
మాధవుడూ యాదవుడూ మాకులమే పొమ్మంది
అని విమర్శలను తేలిగ్గా తీసేశాడాయన….
అందుకే ఆయనంటే నాకు ఇష్టం!!
ఆయనెవరో పెద్దాయన ముప్ఫైకోట్ల మంది దేవతల గురించి తికమక పడుతుంటే…

కల్యాణ రామునికి కౌసల్య లాలి
యదువంశ విభునికి యశోద లాలి
కరిరాజ ముఖునికి గిరితనయ లాలి
పరమాబ్జ భవునికి పరమాత్మ లాలిఅంటూ జ్ఞానపీఠి సినారె చేత ఎవరికి ఎవరు లింకో చెప్పడమే కాకుండా.,

వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడా‌ల లాలిఅంటూ నవరత్నాలను మనందరి ముంగిట్లో రాశులుగా పోసిన విశ్వనాథ్ గారంటే నాకెంతో ఇష్టం….

(నేడు, ఫిబ్రవరి 19 కె విశ్వనాథ్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

మీ
చక్రావధానుల రెడ్డప్ప ధవేజి
9703115588

RELATED ARTICLES

Most Popular

న్యూస్