ఆసియా కప్ క్రికెట్ సూపర్ -4 దశలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై శ్రీలంక 5 వికెట్లతో విజయం సాధించింది. పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 121పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక ఈ లక్ష్యాన్ని 17 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మూడు వికెట్లు తీయడంతో పాటు రెండు క్యాచ్ లు పట్టి… బ్యాటింగ్ లో సైతం మూడు బంతుల్లో రెండు ఫోర్లతో 10పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన హసరంగకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్-30; నవాజ్-26; రిజ్వాన్-14;ఫఖర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్ చెరో 13 పరుగులు చేశారు. లంక బౌలర్లు ఫుల్ లైన్ అండ్ లెంగ్త్ తో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టారు. దీనితోపాకిస్తాన్ 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. వీటిలో 17 రన్స్ ఎక్స్ ట్రాల రూపంలో రావడం గమనార్హం.
లంక బౌలర్లలో హసరంగ మూడు; తీక్షణ, ప్రమోద్ మధుశాన్ చెరో రెండు; ధనుంజయ డిసిల్వా, కరుణ రత్నే చెరొక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన లంక ఇన్నింగ్స్ రెండో బంతి కే తొలి వికెట్ (కుశాల్ మెండీస్-డకౌట్) కోల్పోయింది. రెండో ఓవర్లో దాసున్ గుణతిలక కూడా డకౌట్ అయ్యాడు. ఆ కాసేపటికే ధనుంజయడిసిల్వా (9) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో ఓపెనర్ పాతుమ్ నిశాంక, భానుక రాజపక్షే తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రాజపక్ష 19 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ దాసున్ శనక 16 బంతులో 1 ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. నిశాంక 48 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్ తో 55; హసరంగ-10 పరుగులతో అజేయంగా నిలిచి విజయం అందించారు.
సెప్టెంబర్ 11న ఆదివారం ఈ రెండు జట్లే ట్రోపీ కోసం ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి.
Also Read : Kohli- Bhuvi Show: ఆఫ్ఘన్ పై అలవోకగా